బైక్ చోరీలకు ‘చైన్’ లాక్!
ABN , Publish Date - May 31 , 2025 | 01:06 AM
- ఓ యువకుడు తన బైక్‌ను పీఎన్‌బీఎస్‌లో పెట్టి ఏలూరు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. -చిట్టినగర్‌లోని కొండ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని కొండ దిగువన రోడ్డుపక్క పెట్టి ఇంటికి వెళ్లాడు. మర్నాడు ఉదయం కొండ దిగి వచ్చి చూస్తే బైక్ పెట్టినచోట లేదు. దీంతో వెంటనే కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంటి ముందు రాత్రి నిలిపిన ద్విచక్రవాహనం ఉదయం వరకు ఉంటుందన్న భరోసా ఉండడం లేదు. రైల్వే స్టేషన్ వద్ద పెట్టి రైలెక్కితే తిరిగి వచ్చే సరికి బైక్ ఏమవుతుందో తెలియదు. బస్‌స్టాండ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ, ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడా చూసినా బైక్‌లకు భద్రత ఉండడం లేదు. ఎక్కడో ఒక చోట బైక్ మాయమవుతూనే ఉంది. దీనికి చెక్ పెట్టడానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు గొలుసుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ముందు విజయవాడ నగరంలో దీన్ని పట్టాలు ఎక్కించారు. ప్రస్తుతం మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే జిల్లా మొత్తం అమలు చేయాలని భావిస్తున్నారు.
మూడు పీఎస్‌ల పరిధిలో కొత్త ప్రణాళిక అమలు
తగ్గిన బైక్ అపహరణ ఫిర్యాదులు
ఆధారాలు చూపిస్తేనే అన్‌లాక్
సత్ఫలితాలనిస్తున్న చైన్‌లాక్ కార్యక్రమం
- ఓ యువకుడు తన బైక్‌ను పీఎన్‌బీఎస్‌లో పెట్టి ఏలూరు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు.
-చిట్టినగర్‌లోని కొండ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని కొండ దిగువన రోడ్డుపక్క పెట్టి ఇంటికి వెళ్లాడు. మర్నాడు ఉదయం కొండ దిగి వచ్చి చూస్తే బైక్ పెట్టినచోట లేదు. దీంతో వెంటనే కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇంటి ముందు రాత్రి నిలిపిన ద్విచక్రవాహనం ఉదయం వరకు ఉంటుందన్న భరోసా ఉండడం లేదు. రైల్వే స్టేషన్ వద్ద పెట్టి రైలెక్కితే తిరిగి వచ్చే సరికి బైక్ ఏమవుతుందో తెలియదు. బస్‌స్టాండ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ, ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడా చూసినా బైక్‌లకు భద్రత ఉండడం లేదు. ఎక్కడో ఒక చోట బైక్ మాయమవుతూనే ఉంది. దీనికి చెక్ పెట్టడానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు గొలుసుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ముందు విజయవాడ నగరంలో దీన్ని పట్టాలు ఎక్కించారు. ప్రస్తుతం మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే జిల్లా మొత్తం అమలు చేయాలని భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి -విజయవాడ):
చాలా మంది ప్రయాణికులు బస్టాండ్, రైల్వేస్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలపై వెళ్తారు. అక్కడ స్కూటర్ స్టాండ్లలో వాహనాలను పెట్టకుండా బయట ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేస్తారు. ఉదయం ఊరు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేద్దామని ప్రయాణాలను రూపొందించుకున్న వారిలో ఎక్కువ మంది ఇదే పని చేస్తున్నారు. ఇలా పార్క్ చేసిన వాహనాలను చేతివాటం గ్యాంగ్ నిశితంగా పరిశీలిస్తోంది. ద్విచక్ర వాహనాలు పార్క్ చేయడం మొదలు వారు బస్సు, రైలు ఎక్కేవరకు అన్ని కదలికలను గమనిస్తోంది. ఆ తర్వాత బైక్‌లను మారుతాళాలతో అక్కడి నుంచి మాయం చేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు. ఇళ్ల ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలను కొంతమంది రెక్కీ చేసి ఎత్తుకుపోతున్నారు. ఎండాకాలం కావడం, ఉక్కబోతలకు కుటుంబమంతా ఇళ్లలో ఏసీలు ఆన్ చేసుకుని గాఢ నిద్రలో ఉండడంతో అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతున్న దొంగలు కనిపించిన వాహనాలను మాయం చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో గడచిన ఏడాది 230 మంది ద్విచక్ర వాహనాలు చోరీ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 185 వాహనాలు మాయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ ఉంటే వాహనాలను పెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్న వారికి భద్రత భరోసాను ఇవ్వడానికి పోలీసులు ఇనుప గొలుసులను ఉయోగిస్తున్నారు. కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరానికి సరిపడే విధంగా ఇనుప గొలుసులను కిలోల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. రెండు కొనల వద్ద తాళం వేసేవిధంగా రింగ్‌లను అమర్చుతున్నారు. ఆ గొలుసులను వాహనాల చక్రాల మధ్య నుంచి తీసుకెళ్లి రెండు కొనలను కలిపి తాళం వేస్తున్నారు. ఇలా ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకు గొలుసులను అల్లేసి తాళాలు వేస్తున్నారు. దీనితో ఏ వాహనాన్ని ఇక్కడి నుంచి కదపలేని పరిస్థితి.
ఒరిజినల్ ఆర్‌సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ చూపితేనే..
వాహనానికి సంబంధించి యజమానులు వచ్చి వాటిని తీసుకోవాలంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో దానికి సంబంధించి ఒరిజినల్ ఆర్‌సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించాలి. ఈ విధంగా చేస్తేనే బైక్ అన్‌లాక్ అవుతుంది. లేకపోతే లాక్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో గొలుసుల ప్రణాళికలను అమలు చేస్తున్నారు. భవానీపురం, కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రజల జీవన పరిస్థితులు ఇతర ప్రాంతాల వారి కంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఇళ్లన్నీ కొండలపై ఉంటాయి. వారి వాహనాలను కొంతమేరకు మాత్రమే తీసుకెళ్లగలరు. ఆ తర్వాత పైన ఉన్న ఇళ్ల వాళ్లంతా వాహనాలను ఒకచోట నిలుపుకుని తాళాలు వేస్తారు. మరికొంత మంది ప్రధాన రహదారికి పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో పార్క్ చేస్తున్నారు. ఈ వాహనాలకూ గొలుసులను అల్లి తాళాలు వేస్తున్నారు.
బైక్ చోరీలు తగ్గాయి
బైక్‌లు చోరీ అవుతున్నాయని ఫిర్యాదులు పెరగడంతో చైన్ లాక్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. దీని వల్ల సత్ఫలితాలు కనిపించాయి. ముందుగా కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో అమలు చేశాం. ఇక్కడ బస్టాండ్ ఉంది. నిత్యం ఏదో ఒక ఫిర్యాదు బైక్ చోరీలపై వచ్చేది. ఇక్కడ ఇప్పుడు బైక్ చోరీలు తగ్గాయి. ఆ తర్వాత కొండ ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్‌లోనూ దీన్ని అమలు చేస్తున్నాం.
- ఎస్వీ రాజశేఖరబాబు, పోలీస్ కమిషనర్