సంస్కృత భాషలో సర్టిఫికెట్ కోర్సు
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:23 PM
సంస్కృత భాషను దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆ భాషను మరింత విస్తృత పరిచే దిశగా కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం కార్యక్రమాలను రూపొందించిందని జిల్లా శిక్షణ కోఆర్డినేటర్ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు.

కర్నూలు కల్చరల్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సంస్కృత భాషను దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆ భాషను మరింత విస్తృత పరిచే దిశగా కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం కార్యక్రమాలను రూపొందించిందని జిల్లా శిక్షణ కోఆర్డినేటర్ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం కర్నూలులో బుధవారపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యూఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆ కళాశాల్లో సంస్కృత అధ్యయన కేంద్రం ప్రారంభించామని తెలిపారు. సంస్కృత భాష అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో, సంస్కృతం రాయడం, చదవడం, మాట్లాడటం వంటి అంశాల్లో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ శిక్షణల్లో 15 ఏళ్లు పైబడి వారు ఎవరైనా చేరవచ్చని, వ్యాపారులు, గృహిణులు, ఉద్యోగులు, యువత ఈ శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జి.పుల్లారెడ్డి కళాశాలలో ప్రతిరోజు సాయంత్రం 4-5 గంటల మధ్య శిక్షణ ఉంటుందన్నారు. అక్కడికి రాలేని వారికి నగరంలోని కేశవ మెమోరియల్ పాఠశాల్లో శనివారం సాయంత్రం 5-7 గంటల మధ్య, ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు 90195 56184, 87623 94795 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎనఎస్‌ఎస్ విభాగం అధికారి కురిడి సురేష్, సంస్కృత భారతి జిల్లా శాఖ అధ్యక్షురాలు మహాలక్ష్మి, సంస్కృత భారత నగర అధ్యక్షులు గుబ్బా బాలస్వామి, ప్రచారకులు రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.