Union Jal Shakti Minister C.R. Patil: నదుల అనుసంధానంపై త్వరలోసీఎంలతో సమావేశం
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:06 AM
జాతీయ నదుల అనుసంధాన పథకంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు....
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్
గంగా-కావేరీపై కుదరని ఏకాభిప్రాయం
ఇచ్చంపల్లి నుంచి తరలింపునకు అంగీకరించం: ఏపీ
ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనకు అంగీకరిస్తాం: తెలంగాణ
మాకు 25 టీఎంసీలంటే ఎలా?: కర్ణాటక డిప్యూటీ సీఎం
ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో ఏకాభిప్రాయానికి రాని రాష్ట్రాలు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ నదుల అనుసంధాన పథకం’పై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. నదీజలాల వాటా, అలైన్‌మెంట్‌లపై ఏకాభిప్రాయం సాధ్యంకాని పరిస్థితుల్లో త్వరలోనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. గంగా-కావేరీ(గోదావరి కూడా) నదుల అనుసంధాన పథకంపై మంగళవారం ఢిల్లీలో సీఆర్ పాటిల్ అధ్యక్షతన జాతీయ నదీజలాల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశం జరిగింది. మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు. దేశీయంగా నదీ జలాల ఆవశ్యకత చాలా ఉందని, గ్రామీణ ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందించాలని ప్రధాని మోదీ ప్రత్యేక లక్ష్యం నిర్దేశించుకున్నారని, అందుకే గంగా-కావేరీ నదుల అనుసంధాన పథకానికి మొగ్గు చూపారని తెలిపారు. నదుల అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే నదుల అనుసంధానంపై సమగ్ర నివేదిక తయారు చేశామని చెప్పారు. దీనిపై అద్యయనం చేసి అభిప్రాయాలను వెల్లడించాలని రాష్ట్రాలను కోరామన్నారు. రాష్ట్రాల నుంచి ఇప్పటిదాకా ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని పాటిల్ వివరించారు. త్వరలోనే నదుల అనుసంధాన పథకం లబ్ధిదారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధానంగా గంగా-కావేరీ అనుసంధాన పథకంలో భాగమైన.. గోదావరి-కావేరి నదుల అనుసంధాన పథకంపై తెలంగాణ జోక్యం చేసుకుంది. ఇచ్చంపల్లి నుంచి కావేరి అనుసంధాన పథకం డిజైన్‌ను తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. అయితే, తమకు గోదావరి జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమకు అనుగుణంగా ఆయకట్టు మార్పులు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని ప్రతిపాదించింది. అదేవిధంగా రెండు రిజర్వాయర్లు నిర్మించుకునేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ అధికారులు కోరారు. ట్రైబ్యునళ్లలో విచారణ జరుగుతున్నందున ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై స్పష్టత వచ్చేంత వరకు ఈ ప్రతిపాదనలు అమలుకాకుండా ఆపాలని విజ్ఞప్తి చేసింది. దీంతో జలాల వాటాలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పాటిల్ స్పష్టం చేశారు.
బనకచర్లతోనే బాగు: ఏపీ
తెలంగాణ అధికారుల అభిప్రాయంతో ఏపీ అధికారులు ఏకీభవించలేదు. పోలవరం-బనకచర్ల అనుసంఽధాన పథకం ద్వారా గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని చేపడితే ఖర్చు తగ్గడమే కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాలూ తగ్గుతాయని ఏపీ తరఫున జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ సుగుణాకరరావు వివరించారు. పెన్నా-కావేరి నదుల అనుంసఽంధానానికి కూడా పోలవరం-బనకచర్ల ఉపయోగపడుతుందన్నారు. ఇచ్చంపల్లి నుంచి కావేరీ అనుసంధానం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇచ్చంపల్లి వద్ద నీటి నిల్వలు లేవని వెల్లడించారు. ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతున్నట్లుగా ఛత్తీ్‌సగఢ్ వాడుకోని 147 టీఎంసీల గోదావరి జలాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఒకవైపు ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చంటూ ఛత్తీ్‌సగఢ్‌కు ఎన్‌డబ్ల్యూడీఏ ఆమోదముద్ర వేసిందని పేర్కొన్నారు. ఒకవైపు ఛత్తీ్‌సగఢ్ ప్రాజెక్టులు కడతామంటుంటే.. గంగా జలలాను తరలిస్తామంటూ కేంద్రం చెబుతుండటం దిగువ రాష్ట్రాలకు నమ్మశక్యంగా లేదని ఏపీ స్పష్టం చేసింది. ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయంతో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల ద్వారా గోదావరి జలాలను తరలించి.. ఈ ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేసుకునేందుకు ఉపయోగించుకుంటామంటే అసలు అంగీకరించేది లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించింది. గోదావరి-కావేరి అనుసంధాన పథకంపై అభ్యంతరాలు లేకుండా ఉండాలంటే.. దిగువన ఉన్న పోలవరం-బనకచర్ల పథకం ద్వారా గోదావరి జలాలను కావేరికి తరలించడమే ఉత్తమమని వెల్లడించింది. ఈ సూచనతో ఎన్‌డబ్ల్యూడీఏ సానుకూలంగా స్పందించింది. కానీ, తుది నిర్ణయం తీసుకోలేదు. గోదావరి నదిపై తెలంగాణ ఇష్టారీతిన అనధికార ప్రాజెక్టులు నిర్మించిందని.. దానివల్ల ఇతర రాష్ట్రాలకు జలాల సమస్యలు తలెత్తుతున్నాయని ఏపీ పేర్కొంది.
35 టీఎంసీలు కేటాయించాలి: కర్ణాటక
కావేరీ అనుసంధాన పథకంలో తమకు 25 టీఎంసీలనే కేటాయించడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం 35 టీఎంసీలైనా ఇవ్వాలని కోరారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు తమకు కూడా జలాల వాటాను పెంచాలని కోరారు.