Minister Bhupathiraju Srinivasa Varma: ఆక్వా రైతులకు అండగా కేంద్రం
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:46 AM
ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు.
లక్ష కోట్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యం
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగాన్ని ఆధునీకరించి, ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2024-25లో 7.45 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు తెలిపారు. భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తానూ ఆక్వా రైతునని, ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఆక్వా రంగ ఇబ్బందులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తున్నారని కొనియాడారు.