Central Govt: రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:11 AM
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీశాఖ నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) అనుమతిని నిరాకరించింది.

మళ్లీ విధివిధానాలు జారీ చేయాలని నిర్ణయం
హైదరాబాద్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీశాఖ నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) అనుమతిని నిరాకరించింది. ఈ ప్రాజెక్టుకు మళ్లీ అనుమతి కోసం విధివిధానాలు జారీ చేయాలని గతనెల 27న వివిధ ప్రాజెక్టులకు అనుమతి కోసం జరిగిన ఈఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఎత్తిపోతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖలు రాశారు. కేంద్ర పర్యావరణ మంత్రిని నేరుగా కూడా కలిసి, ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతిని నిరాకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
‘‘ఎన్‌జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి, రాయలసీమ ఎత్తిపోతలను ఏపీ నిర్మిస్తోందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం వల్లే పర్యావరణ అనుమతి ఆగిపోయుంది. ఈ ప్రాజెక్టును అడ్డుకోకపోతే తెలంగాణలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తేవి’’ అని ఈ నిర్ణయంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.