Montha Cyclone Affected: రాష్ట్రంలో నేడు, రేపు కేంద్రబృందం పర్యటన
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:20 AM
మొంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆరు జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సోమ, మంగళవారాలు పర్యటించనుంది.....
మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా
అనంతరం సచివాలయంలో సీఎంతో భేటీ
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆరు జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సోమ, మంగళవారాలు పర్యటించనుంది. ఎనిమిది మంది సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో తుఫాన్ నష్టాన్ని పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తుఫాన్ ప్రభావం, నష్టంపై అధికారులు ఏర్పాటు చేసే ఫొటో ప్రదర్శనను తిలకించనున్నారు. సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో రెండు బృందాలకు రాష్ట్ర అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుఫాన్ పరిణామాలు, ప్రభుత్వ సహాయక చర్యలు, నష్టాలను వివరించనున్నారు. అనంతరం టీమ్1 ప్రకాశం జిల్లా, టీమ్2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నాయి. మంగళవారం ఉదయం టీమ్1 బాపట్ల జిల్లా, టీమ్2 కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నాయి. మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్రబృందం సమావేశమై తుఫాన్ నష్టంపై చర్చించనుంది.