Data Center in Visakhapatnam: విశాఖలో డేటా సెంటర్‌కు కేంద్రం సహకారం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:51 AM
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని కేంద్ర ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..
ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
విశాఖపట్నం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని కేంద్ర ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. విశాఖలో డేటాసెంటర్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానికి యాంకర్ కంపెనీగా గూగుల్ ఆసక్తి చూపుతోందని, దీనికోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సాయం కోరుతోందా? అంటూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.అశ్వినీ వైష్ణవ్ సమాధానమిస్తూ విశాఖపట్నాన్ని డేటా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని, అందులో ఏఐ, అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చి సెంటర్, డిజిటల్ స్కిల్లింగ్ వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని, డేటా సిటీ ఏర్పాటుకు న్యాయపర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో దఫదఫాలుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు.