Share News

Central Rural Development Ministry: పోలవరం నిర్వాసితులకు ఒకే దఫాలో పరిహారమివ్వకపోతే ఎలా

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:49 AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఒకే దఫాలో సహాయ పునరావాస మొత్తాన్ని అందజేయకపోవడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసహనం వ్యక్తం చేసింది.

Central Rural Development Ministry: పోలవరం నిర్వాసితులకు ఒకే దఫాలో పరిహారమివ్వకపోతే ఎలా

  • విడతలవారీ చెల్లింపులతో అసంతృప్తి

  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆగ్రహం

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఒకే దఫాలో సహాయ పునరావాస మొత్తాన్ని అందజేయకపోవడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ల్యాండ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగం కమిషనర్‌ శైలే్‌షకుమార్‌ సింగ్‌ జాతీయ హోదా ప్రాజెక్టులు నిర్మిస్తున్న రాష్ట్రాలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులను పరిశీలించారు. మొదటి దశలో భూసేకరణ కోసం రూ.12,832 కోట్లను చెల్లించాల్సి ఉండగా.. రూ.6,609 కోట్లు మాత్రమే ఇవ్వడంపై పెదవివిరిచారు. నిర్మించిన పునరావాస కాలనీల నిర్వహణ జలవనరులశాఖ చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఒకేదఫాలో సహాయ పునరావాస పరిహారం చెల్లిస్తే.. ప్రభుత్వం తమకు సరైన నష్టపరిహారం ఇచ్చిందన్న సంతోషం వ్యక్తమవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. విడతలవారీ చెల్లింపులతో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని పేర్కొంది. నిర్వాసితులకు సహాయ పునరావాసం చెల్లింపులకు అధికప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

Updated Date - Oct 01 , 2025 | 05:51 AM