Central Govt: ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో స్థానికులకు 95శాతం
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:40 AM
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)ను విడుదల చేసింది.
ఓపెన్ 5 శాతం
1 నుంచి 7 తరగతుల్లో ఎక్కువ ఎక్కడ చదివితే అక్కడే స్థానికత
మొత్తం ఆరు జోన్లుగా రాష్ట్రం
మల్టీజోనల్ పోస్టులుగా సీటీవో, డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్
27 నెలల్లోగా లోకల్, జోన్,మల్టీజోన్ పోస్టుల ప్రకటన
రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి కూడా లోకల్, జోన్, మల్టీజోన్ పోస్టులకు బదిలీ
నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)ను విడుదల చేసింది. ప్రభుత్వ నియామకాలు, పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాల వంటి విషయాల్లో స్థానికతను నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు, మరో 5 శాతాన్ని ఓపెన్ కోటాగా ఉంచుతూ కేంద్ర హోం శాఖ ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్-2025’ పేరిట సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా జరిగిన మార్పులేమిటంటే.. గతంలో 4 జోన్లు ఉండగా ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో 6 జోన్లు చేశారు. వీటిని తిరిగి 2 మల్టీజోన్లుగా విభజించారు. గతంలో రాష్ట్ర కేడర్ పోస్టులుగా ఉన్న సీటీవో, డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా మార్చారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు పోటీ అధికం కావడంతో వీటిని మల్టీజోనల్ పోస్టులుగా చేశారు. దీని వల్ల స్థానికులకు అవకాశాలు మెరుగుపడతాయి. గతంలో సీటీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు రాష్ట్రమంతా ఏ జిల్లాకైనా బదిలీపై వెళ్లేవారు. ఇప్పుడలా కుదరదు. ఒక మల్టీజోన్ నుంచి ఇంకో మల్టీజోన్‌కి స్పౌస్ గ్రౌండ్స్‌లో బదిలీ కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు.
మరిన్ని మార్పులు ఇలా..
గతంలో జిల్లా పోస్టులకు స్థానిక, ఓపెన్ కోటా నిష్పత్తి 85:15, జోనల్ పోస్టులకు 70:30, మల్టీ జోనల్ 60:40గా ఉండేది. ఇప్పుడు ఆ మూడు రకాల పోస్టులకు లోకల్, ఓపెన్ కోటాను 95:5గా చేశారు.
గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే స్థానికులుగా ఉంటారు.
ఉద్యోగుల విభజనకు సంబంధించి ఉద్యోగులకే చాయిస్ ఇస్తా రు. వయసు, సీనియారిటీ, మిగులు సర్వీసు కాలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ ఆర్డర్ జారీ అయినప్పటి నుంచి 27 నెలల్లోగా రాష్ట్రప్రభుత్వం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను నిర్ణయించాలి.
జూనియర్ అసిస్టెంట్ అంతకంటే దిగువ పోస్టులకు జిల్లా యూనిట్‌గా రిక్రూట్‌మెంట్, బదిలీలు జరుగుతాయి. జూనియర్ అసిస్టెంట్ కంటే పై క్యాడర్ నుంచి ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారి వరకు జోన్ యూనిట్‌గా భర్తీ, బదిలీలు ఉంటాయి. ఆపై పోస్టులకు మల్టీజోన్ ప్రాతిపదికన జరుగుతాయి.
సచివాలయం, హెచ్‌వోడీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి ఉద్యోగులు లోకల్, జోనల్, మల్టీజోనల్ క్యాడర్లలో డిప్యుటేషన్‌పై వెళ్లి పనిచేయొచ్చు.
కృష్ణా నదికి ఎగువన ఉన్న జిల్లాలను మల్టీజోన్-1లో, దిగువన ఉన్న జిల్లాలను మల్టీజోన్-2గా విభజించారు.
గతంలో రాష్ట్ర క్యాడర్ నుంచి రాష్ట్ర క్యాడర్‌కు బదిలీలపై వెళ్లి పనిచేసేవారు. కానీ రాష్ట్ర క్యాడర్ నుంచి జోనల్, లోకల్ క్యాడర్‌కు వెళ్లడానికి అభ్యంతరం ఉంది. ఈ అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలో ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో కూడా రాష్ట్ర క్యాడర్ నుంచి లోకల్, జోన్ క్యాడర్‌కు బదిలీపై వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు.
ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, క్యాడర్, జోనల్, మల్టీజోనల్‌పై స్పష్టత ఇచ్చారు. 26 జిల్లాలను 6 జోన్లుగా నిర్ణయించారు. వాటిని రెండు మల్టీజోన్లుగా ప్రకటించారు. ఏడేళ్లు ఒకేచోట చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణించాలని పేర్కొన్నారు.
మల్టీజోన్-1లో జోన్-1, 2, 3... మల్టీజోన్-2లో జోన్-4, 5, 6 ఉన్నాయి.
జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు.
జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ.
జోన్-3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం
జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
జోన్-6: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి
రాష్ట్రప్రభుత్వం సముచితమని భావిస్తే పక్కపక్కనే ఉన్న జిల్లాల్లో లేదా జోన్లలో ఏదైనా విభాగం లేదా సంస్థలో వివిధ రకాల పోస్టులను ఒకే క్యాడర్‌గా చూపించవచ్చు. ఏదైనా విభాగానికి ప్రత్యేక క్యాడర్‌ను కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏదైనా విభాగంలో నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఆచరణ సాధ్యం కాదని లేదా నిరుపయోగమని ప్రభుత్వం భావిస్తే నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రకటన చేయొచ్చు.
వివిధ విభాగాలు, వివిధ పోస్టులకు సంబంధించి స్థానిక క్యాడర్లకు ఉద్యోగుల విభజనపై సలహాల కోసం కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చు.
విభజనపై అభ్యంతరాలున్న ఉద్యోగులు 60 రోజుల్లోగా వినతిపత్రం ద్వారా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు ప్రభుత్వం సంబంధిత వ్యవహారాలు చూసే కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం మరో ఉద్యోగి అవకాశాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు.
వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డీ(3)కు లోబడి ఉండాలి.
ఒక జిల్లా/జోన్/మల్టీజోన్ క్యాడర్ నుంచి ఇంకో జిల్లా/జోన్/మల్టీజోన్‌లోకి స్పౌస్ గ్రౌండ్‌లో బదిలీ కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు.
స్థానిక రిజర్వేషన్లు, రాష్ట్ర స్థాయి పోస్టులు, రాష్ట్రస్థాయి కార్యాలయాలకు సంబంధించి ఇంకా 3 గెజిట్ నోటిఫికేషన్లు రావలసి ఉంది.