Central Govt : అమరావతి రుణం వేరు-రాష్ట్ర రుణం వేరు
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:55 AM
ఏపీ రాజధాని అమరావతి కోసం అందించే రుణాన్ని.. రాష్ట్ర రుణ పరిమితిలో భాగంగా లెక్కించబోమని, రెండు రుణాలను వేర్వేరుగా చూస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

రుణ పరిమితిలో భాగంగా లెక్కించబోం
మరో రూ.1500 కోట్లు గ్రాంటుగా అందిస్తాం
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి కోసం అందించే రుణాన్ని.. రాష్ట్ర రుణ పరిమితిలో భాగంగా లెక్కించబోమని, రెండు రుణాలను వేర్వేరుగా చూస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలు, షరతుల ద్వారా నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తామని, దీనికిగాను పర్యవేక్షణా యంత్రాంగం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్ సభలో వివరించారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు చౌదరి సమాధానం ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు రెండూ రూ.6,700 కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించిందని తెలిపారు. వీటికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసిందన్నారు. ఈ మొత్తాన్ని అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి, అమరావతి ఇంక్లూజివ్, సస్టైనబుల్ కాపిటల్ సిటీ డెవల్‌పమెంట్ ప్రోగ్రాంకు వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఏడీబీ రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచీ అమలులోకి వస్తాయన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ నిధులు విడుదల కాలేదని తెలిపారు. కాగా, మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మేరకు రూ.1500 కోట్లకు మించకుండా తమవంతు రాజధాని నిర్మాణానికి ప్రత్యేక గ్రాంటును ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. గతంలో ప్రత్యేక గ్రాంటు కింద రూ.2500 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు.