Share News

CPI Leader Narayana: కేంద్రాన్ని శాసించాల్సిన చంద్రబాబు దేహీ అంటున్నారు

ABN , Publish Date - Dec 22 , 2025 | 06:07 AM

తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని శాసించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

CPI Leader Narayana: కేంద్రాన్ని శాసించాల్సిన చంద్రబాబు దేహీ అంటున్నారు

  • రేవంత్‌తో కూర్చుని మాట్లాడితే ప్రాజెక్టుల సమస్య పరిష్కారం

  • సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నారాయణ

నెల్లూరు (వైద్యం), డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని శాసించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...నిధుల కోసం కేంద్రాన్ని దేహీ అంటున్నారని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె. నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద బిచ్చమెత్తుకునే వారు అడుక్కున్నట్టు రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వద్ద చంద్రబాబు అడుక్కుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని శాసించే అధికారం ఉన్నా దాన్ని వినియోగించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పోలవరంతోపాటు పలు ప్రాజెక్టులు వ్యతిరేకిస్తోందని, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శిష్యుడు రేవంతిరెడ్డి ఉన్నారని, సానుకూలంగా కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, అణురంగాన్ని ప్రైవేట్‌పరం చేసేలా పార్లమెంట్‌లో బిల్లు పెడుతోందని విమర్శించారు. అణురంగాన్ని ప్రైవేట్‌పరమైతే చాలా ప్రమాదం చోటుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పఽథకంలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం పారిశ్రామిక వేత్తలకు రూ.25 లక్షల కోట్లు కట్టబెట్టిందన్నారు. ఎన్నికల కమిషన్‌ చేతిలో ఉందని దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ సోమవారం ఆందోళనలు చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Dec 22 , 2025 | 06:07 AM