Central Govt: రయ్ రయ్.. రహదారులకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:48 AM
రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, హైవేల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 11,597 కోట్లతో 441 కిలోమీటర్ల మేర...
11,597 కోట్లతో 441 కి.మీ. మేర హైవేలు
రాష్ట్ర ప్రతిపాదనలకు జాతీయ రహదారులు, హైవేల సమావేశం ఆమోదం
రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, హైవేల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 11,597 కోట్లతో 441 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశానికి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను కేంద్రానికి అందజేశారు. మొత్తం 24 ప్రాజెక్టులపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రతిపాదనలను ఆమోదిస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని కేంద్రం వెల్లడించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎ్‌స)తో కలసి ఇంటీగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ (ఐఆర్‌ఏడీ) డేటా లేక్ రూపకల్పనకు కేంద్రం సమ్మతించింది.
రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి
ఖరగ్‌పూర్-కటక్-విశాఖపట్నం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మాణం.
శ్రీశైలం దేవాలయాన్ని కలుపుతూ ఎన్‌హెచ్ 765 రహదారిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా జాతీయ రహదారి.
పలమనేరు-కృష్ణగిరి సెక్షన్‌లో కుప్పం మీదుగా నాలుగు లేన్ల రహదారికి డీపీఆర్ తయారీ.
అమరావతి రాజధాని నగరంలో రింగ్‌రోడ్‌ను 212 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
వినుకొండ-గుంటూరు నాలుగు లేన్ల ఓఆర్‌ఆర్‌కు ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది.
హైదరాబాద్-గొల్లపూడి నాలుగు లేన్ల రహదారి ఆరు లేన్ల రహదారిగా మార్పు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి హైదరాబాద్‌కు ఈరహదారి విస్తరణ ఉంటుంది.
విజయవాడ-మచిలీపట్నం ప్రస్తుతం నాలుగు లేన్లగా ఉన్న రహదారిని 64 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదన.
హైదరాబాద్- అమరావతి- మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ రోడ్ 270 కి. మీ. మేర మార్పులు చేర్పులపై అధ్యయనానికి అంగీకారం.