Central Govt: పోలవరానికి మరో 2,704 కోట్లు
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:16 AM
పోలవరం ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేకుండా కేంద్రం మరో రూ.2,704 కోట్లు మంజూరు చేసింది.

కేంద్రం నిర్ణయం.. ఒకట్రెండు రోజుల్లో విడుదల
తొలి విడతలో 2,348 కోట్లు ఇచ్చిన వైనం
పనుల పురోగతిపై 17న పీపీఏ సమీక్ష
అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేకుండా కేంద్రం మరో రూ.2,704 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ నిధులు ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా తెరచిన బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తొలి విడతగా గతేడాది అక్టోబరులో కేంద్ర జలశక్తి శాఖ రూ.2,348 కోట్లు అడ్వాన్సుగా ప్రకటించింది. దరిమిలా డయాఫ్రం వాల్, ఇతరత్రా పనులను ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడీ 2,704 కోట్లు ఇస్తోంది.
ఇంకోవైపు.. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. 18న కేంద్ర జల సంఘం కూడా సమీక్ష జరుపనుంది. ఈ నెల 27న పోలవరం బ్యాక్‌వాటర్ సమస్యపై ఏపీ, తెలంగాణ అధికారులతో పీపీఏ భేటీ కానుంది.