Bala Veeranjaneya Swamy: పీపీపీ విధానానికి కేంద్రం కితాబు
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:14 AM
వైద్య కళాశాలల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వమే సమర్థించిందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
జగన్ ప్రేలాపనలు మానుకోవాలి: మంత్రి స్వామి
ఒంగోలు క్రైం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వమే సమర్థించిందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం ఒంగోలు ఉత్తర బైపా్‌సలోని బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన ముందుగా మీడియాతో మాట్లాడారు. ‘పీపీపీ విధానం ద్వారా నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీలను తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. అయితే ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలడం మానుకోవాలి. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ముందుకు వస్తున్న సంస్థలకు ఫోన్లు చేసి బెదిరించడం మంచి పద్ధతి కాదు. ఏదిఏమైనా పీపీపీ విధానం ద్వారానే ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ అది శ్రుతిమించితే చర్యలు తప్పవు’ అని మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్ విజయకుమార్ ఉన్నారు.