Dispute Resolution: బనకచర్లపై ఏకాభిప్రాయ సాధన
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:47 AM
రాయలసీమకు గేమ్ చేంజర్‌గా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణ సీఎంకు పాటిల్ లేఖ
సహకరించాలని కోరిన కేంద్ర మంత్రి
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు గేమ్ చేంజర్‌గా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గత నెల 21న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు విషయంలో సహకరించాలని ఆయనను కోరినట్టు తెలిసింది. ఈ లేఖకు సంబంధించిన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదిలావుంటే.. ఈ ఏడాది జూన్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును రాష్ట్ర జల వనరులశాఖ.. కేంద్ర జల సంఘానికి పంపింది. అయితే, ఇతర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు వరద జలాల లభ్యతపై గణాంకాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. ఈ గణాంకాలను కూడా సిద్ధం చేసిన రాష్ట్ర జల వనరుల శాఖ.. సోమవారం తర్వాత కేంద్రానికి నివేదిక పంపేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కూడా త్వరలోనే కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డీపీఆర్ తయారు చేసేందుకు ఈ నెల 5న టెండర్లు పిలిచింది. టెండరు దక్కించుకున్న సంస్థ ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును ఆధారం చేసుకుని.. ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రాజెక్టు వ్యయాన్ని సాంకేతికంగా అంచనా వేస్తుంది. ఈ నివేదికను సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి పంపాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇదిలావుంటే, వివాదాల పరిష్కారానికి ఇబ్రహీంపట్నం ఎగువన దాములూరు వద్ద అక్విడెక్టు నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు.