Share News

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం!

ABN , Publish Date - Jan 16 , 2025 | 07:14 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర కేబినెట్ రూ.11,500 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం!

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ వాసులకు గుడ్ న్యూస్. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం సిద్ధమైనట్టు. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆర్థిక ప్యాకేజీపై రేపు అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది (vizag steel plant).

Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు


ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానిని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెచ్చారు. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. ఇక ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువడితే సంస్థతో పాటు ఉద్యోగుల ఆర్థిక కష్టాలు తొలగినట్టే. నాలుగు నెలలుగా జీతాలు లేవంటూ విశాఖ ప్లాంట్ అధికారుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను కలిశారు. వితంతువులకు పెన్షన్లు కూడా అందడం లేదని సీఎస్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రభుత్వం తక్షణమే చేయవలసిన సాయం గురించి సీఎస్‌ను కోరారు. పెద్ద ఎత్తున చేపట్టిన అమరావతి నిర్మాణానికి, పేదల ఇళ్లకు నాణ్యమైన విశాఖ ఉక్కును వినియోగించేలా చూడాలని కోరారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు రూ.500 కోట్లు చొప్పున నాలుగు నెలలు అడ్వాన్సుగా ఇచ్చేట్లు ఒప్పించాలని అభ్యర్థించారు.


ఇక విశాఖ ఉక్కును కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని యోచిస్తోందని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవలే పేర్కొన్నారు. 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇటీవల కాలంలో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పేరుకుపోతున్న అప్పులు, కార్యకలాపాల నిర్వహణకు అడ్డంకులు, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురుగాలుల కారణంగా సంస్థ ఇక్కట్ల పాలైంది. అయితే, సంస్థను ఆదుకునేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని స్టీల్ సెక్రెటరీ సందీప్ పౌండ్రిక్ ఇటీవల జాతీయ మీడియాకు తెలిపారు.

Read Latest and Andhrapradesh News

Updated Date - Jan 16 , 2025 | 07:27 PM