CBI and SIT Probe: ఎవరి ఒత్తిడితో చేశారు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:52 AM
‘దైవ భక్తి ఎక్కువని మీరు చెప్పుకొంటారు.. అలాంటిది ఎంతో ప్రాచుర్యం పొందిన, పవిత్రమైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు ఎలా ఆమోదం తెలిపారు’ అని సీబీఐ...
దైవ భక్తి ఉందంటూనే కల్తీ నెయ్యికి ఆమోదమా?
చెవిరెడ్డిని ప్రశ్నించిన సీబీఐ సిట్
కొనుగోలు కమిటీలో ఉన్నప్పటికీ అన్నీ అధికారులే చూసుకున్నారు
నాకా విషయమే తెలీదు..: మాజీ ఎమ్మెల్యే
మంత్రి పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతినీ త్వరలో ప్రశ్నించే అవకాశం
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘దైవ భక్తి ఎక్కువని మీరు చెప్పుకొంటారు.. అలాంటిది ఎంతో ప్రాచుర్యం పొందిన, పవిత్రమైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు ఎలా ఆమోదం తెలిపారు’ అని సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించింది. మద్యం స్కాం కేసులో నిందితుడిగా ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న టీటీడీ బోర్డు మాజీ సభ్యుడైన చెవిరెడ్డిని సోమవారం జైల్లోనే నాలుగు గంటల సేపు ప్రశ్నించారు. టీటీడీ ప్రతి రోజూ సేకరించే వేల కిలోల నెయ్యి సరఫరాలో నాణ్యతకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు ఉంటాయి.. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన టీటీడీ పాలక మండలి.. నిబంధనలన్నీ పక్కకునెట్టి.. తమకు అనుకూలమైన వారికి టెండర్ దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసి.. నాణ్యతకు తిలోదకాలిచ్చేలా ఆ కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించింది. టీటీడీ బోర్డు ఆమోదించిన ఆ సిఫారసుల కమిటీలో చెవిరెడ్డి సభ్యుడిగా ఉన్నారు. దీంతో సిట్ ఆయన్ను విచారించింది.
కల్తీ నెయ్యిని అనుమతించాలని అప్పట్లో ఎవరు ఒత్తిడి చేశారు.. ఎవరైనా సిఫారసు చేశారా.. మీ నిర్ణయమే నకిలీ నెయ్యి సరఫరాకు మార్గం చూపింది.. ఆలోచించకుండా ఇలాంటివి ఎలా ఆమోదించారు.. అని పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అయితే టెక్నికల్ కమిటీలో తాను ఉన్నప్పటికీ అధికారులే అవన్నీ చూసుకున్నారని, తనకా విషయం ఏ మాత్రం తెలీదని చెవిరెడ్డి జవాబిచ్చినట్లు సమాచారం. ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న సిట్ అధికారులు.. అవసరమైతే మరోసారి వచ్చి విచారిస్తామని ఆయనకు చెప్పినట్ల్లు తెలిసింది. కాగా.. అప్పట్లో నెయ్యి కొనుగోలు కమిటీలో సభ్యులైన ప్రస్తుత గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్ అధికారులు త్వరలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.