Share News

CBI: సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తునకు సిద్ధం

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:56 AM

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ సమ్మతి తెలియజేసింది.

 CBI: సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తునకు సిద్ధం

  • వివేకా హత్యకేసులో సీబీఐ మెమో దాఖలు

  • కౌంటర్ల కోసం విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ సమ్మతి తెలియజేసింది. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మెమో దాఖలుచేసింది. తన తండ్రి హత్య కేసులో ఇంకా అసలు వాస్తవాలు వెలుగు చూడలేదని.. గత ప్రభుత్వ హయాంలో తనను, తన భర్తను, సీబీఐ అధికారి రాంసింగ్‌ను నిందితులుగా పేర్కొంటూ కౌంటర్‌ కేసు అల్లడానికి జరిగిన కుట్ర తదితరాలపై తదుపరి దర్యాప్తు జరగాలని వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఆమె కోరిన విధంగా వివిధ కోణాల్లో తదుపరి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సీబీఐ మెమో దాఖలు చేసింది. తొలుత గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి (అప్రూవర్‌)లను నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేశామని సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత సునీతారెడ్డి అభ్యర్థన మేరకు ఈ కేసును సుప్రీంకోర్టు కడప కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసిందని గుర్తుచేసింది. ఆ తర్వాత ఏ-5గా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని.. ఏ-6గా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని, ఏ-7గా వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని, ఏ-8గా ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని పేర్కొంటూ రెండు అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేశామని పేర్కొంది. మరోవైపు.. తదుపరి దర్యాప్తు అవసరం లేదని ఏ-3 ఉమాశంకర్‌రెడ్డి తన కౌంటర్‌లో పేర్కొన్నారు. నిందితులు శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉన్నందున తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదావేసింది.

Updated Date - Oct 30 , 2025 | 04:59 AM