Supreme Court: నీట్ విద్యార్థిని మృతిపై సీబీఐ విచారణ
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:04 AM
మాజీ సీఎం జగన్ హయాంలో నీట్ విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ హయాంలో నీట్ విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైనర్ బాలిక విశాఖలోని ఆకాశ్ బైజూస్ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్ కోచింగ్ కోసం చేరింది. 2023 జూలైలో హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీనిపై ఆమె తండ్రి సుఖ్‌దేబ్ సాహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో అక్రమాలు జరిగాయని, సీసీ ఫుటేజీ దాచిపెట్టారని, వైద్యుల నిర్లక్ష్యంతో తన కుమార్తె మరణించిందని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలుచేశారు. ఆ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సుఖ్‌దేబ్ గతేడాది ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం, సీబీఐ విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్యం అనేది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో అంతర్భాగమని గుర్తుచేసింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏకీకృత చట్టపరమైన చట్రం లేదని, కోటా, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖపట్నం వంటి కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండే నగరాల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, తక్షణ మధ్యంతర రక్షణ అవసరమని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా దేశంలోని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాంకుల కోసం విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచడం సరికాదు. కోచింగ్ సెంటర్లలో మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. విద్యార్థి, కౌన్సెలర్ నిష్పత్తులు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి వంటి పలు నిబంధనలు మార్గదర్శకాల్లో ఉన్నాయి.