Viveka Case: భారతికి ఫోన్ చేసిందెవరు..ఏం చెప్పారు?
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:57 AM
మాజీ సీఎం జగన్ బాబాయి, తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని..
తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి..
వివేకాహత్య కేసులో సీబీఐ కోర్టులో సునీతారెడ్డి పిటిషన్
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ బాబాయి, తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలంటూ నర్రెడ్డి సునీతారెడ్డి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సునీతారెడ్డికి సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని.. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన తనకు మరింత అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో ఆమె అభ్యర్థించారు. సప్లమెంటరీ చార్జిషీటు దాఖలుచేయాలని సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిగితేనే ఇప్పటికీ వెలుగుచూడని అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
పిటిషన్‌లో ఏమున్నదంటే..
వివేకా హత్యకేసులో 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైల్లో 4వ నిందితుడు దస్తగిరిని (అప్రూవర్) కలిసి ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. మెడికల్ క్యాంప్ పేరుతో జైల్లో ప్రవేశించి దస్తగిరిని ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేశారు. ఈ అంశంపై దర్యాప్తు జరిగితేనే కొత్త వాస్తవాలు తెలుస్తాయి.
సాక్షులను భయభ్రాంతులకు గురిచేయడానికి, వారిని ప్రభావితం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని స్వయంగా సీబీఐ తెలిపింది. ఇదేవిషయం ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు ఎదుట వివరంగా పేర్కొన్నారు. వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసిన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నాపైనా, నా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పైనా కేసు పెట్టారు. ఇది తప్పుడు కేసు అని ఏపీ పోలీసులు తమ తుది నివేదికలో తేల్చారు. కృష్ణారెడ్డి పెట్టిన కేసులో గత ప్రభుత్వంలో దర్యాప్తు ఘోరంగా జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి చెందిన సిబ్బంది, సన్నిహితులు దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే కాకుండా బయటనుంచి దర్యాప్తు అధికారిని మానిటర్ చేశారు. అంతేకాకుండా దర్యాప్తు కూడా పులివెందుల పోలీ్‌సస్టేషన్‌లో కాకుండా ప్రైవేటువ్యక్తుల ఇంట్లో జరిపారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఇతర నిందితులను రక్షించడానికి కట్టుకథలతో సీబీఐ కేసుకు తప్పుడు విధానంలో కౌంటర్ కేసును తయారు చేయడానికి కుట్ర చేశారు. రికార్డులను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. ఈ కౌంటర్ కేసుపై తదుపరి విచారణ జరగాల్సిందే.
ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అజేయ కల్లం వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఎదుట సీఆర్పీసీ 161 కింద స్టేట్‌మెంట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో తాను సహాయం చేశానని, దీనికి సంబంధించిన సమావేశాలు హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో జరుగుతుండేవని పేర్కొన్నారు. వివేకా చనిపోయినరోజు (2019 మార్చి 15) తెల్లవారుజామున 5.30 గంటలకు తాను జగన్‌తో సమావేశంలో ఉండగా, అటెండర్ వచ్చి అమ్మ (వైఎస్ భారతి) పిలుస్తున్నారని తెలపగా, జగన్ వెళ్లారని ఆయన పేర్కొన్నారు. పది నిమిషాల తర్వాత తిరిగొచ్చిన జగన్.. చిన్నాన్న (వైఎస్ వివేకా) ఇక లేరని చెప్పారని.. దీంతో తామంతా షాక్‌కు గురయ్యామని తన స్టేట్‌మెంట్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే వివేకా చనిపోయినట్టు ఫోన్ కాల్ ఎవరు చేశారు? ఫోన్‌కాల్ సారాంశం ఏంటి? అనే విషయాలు బయటకురావాల్సిన అవసరం ఉంది.
వివేకా చనిపోయినరోజు ఉదయం 6.15 గంటలకు ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఆ విషయం ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పడానికి ముందే కొంతమంది వ్యక్తులకు మరణ వార్త తెలుసు. ఏ-6 గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డితోపాటు మరికొంతమందికి ఆ విషయం తెలుసునని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఉదయ్‌కుమార్‌రెడ్డి కాకుండా ఇంకా ఎవరెవరికి తెలుసుననే విషయాలపై తదుపరి దర్యాప్తు జరగాల్సి ఉంది.
ఆధారాల చెరిపివేతలో వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించినప్పటికీ ఆధారాలు లేవని వారిని నిందితులుగా చేర్చలేదని సీబీఐ పేర్కొంది. వారిద్దరి పాత్రనూ తేల్చాలి.
దస్తగిరి సన్నిహితుడు సయ్యద్ మున్నా లాకర్‌లోని డబ్బు, బంగారానికి లెక్కలు లేవనే కారణంతోపాటు వాటికి హత్య కేసుతో సంబంధం ఉందంటూ సీబీఐ సీజ్ చేసింది. మున్నా ఇచ్చిన వివరణను బలపరిచే ఎలాంటి డాక్యుమెంట్లూ లేవు. కాబట్టి ఈ అంశంపై సీబీఐ మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏ-2 సునీల్‌యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డి మధ్య నడిచిన మెసేజ్‌లకు సంబంధించి సైతం సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేయలేదు. అలాగే హత్య జరగడానికి కొద్దిరోజుల ముందు లోవరాజు అనే వ్యక్తి మా ఇంట్లో డ్రైవర్‌గా చేరారు. హత్య జరగడానికి మూ డు రోజుల ముందు సెలవు మీద వెళ్లి.. ఆ తర్వా త చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేయడమేకాకుండా ఫోన్ స్విచాఫ్ చేశారు.ఆయన విషయం లో కూడా సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేయలేదు.
ఏ-7, ఏ-8గా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డిలను రక్షించేందుకు శివశంకర్‌రెడ్డి... గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. హత్య తానే చేశానని ఒప్పుకొంటే రూ. 10 కోట్లు ఇస్తామని ఆయనకు శివశంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారు. గంగాధర్‌రెడ్డి అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేసి కస్టోడియల్ ఇంటరాగేషన్ జరపాలి.