Former TTD GM Subrahmanyam: నెయ్యి కల్తీ జరిగినట్లు వైవీకి చెప్పా
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:42 AM
కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, భోలేబాబా అధికార ప్రతినిధి అజయ్‌కుమార్ సుగంధి కస్టడీ విచారణ తొలిరోజు సీబీఐ సిట్ సరైన సమాధానాలు రాబట్టలేకపోయింది.
అయినా పట్టించుకోలేదు.. విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం వెల్లడి
మిగతా ప్రశ్నలపై మౌనం.. పలు ప్రశ్నలకు జవాబులు దాటవేసిన సుగంధి
మరో మూడు రోజులు ఇద్దరినీ విచారించనున్న సీబీఐ
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, భోలేబాబా అధికార ప్రతినిధి అజయ్‌కుమార్ సుగంధి కస్టడీ విచారణ తొలిరోజు సీబీఐ సిట్ సరైన సమాధానాలు రాబట్టలేకపోయింది. వారిద్దరూ ఎక్కువగా మౌనాన్నే ఆశ్రయించారని తెలిసింది. అయితే టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిపిన విషయాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చెప్పానని, అయినా ఆయన పట్టించుకోలేదని సుబ్రహ్మణ్యం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కల్తీ నెయ్యి ఎందుకు సరఫరా చేస్తున్నారని ఎప్పుడైనా డెయిరీ నిర్వాహకులను అడిగావా అన్న ప్రశ్నతో పాటు ఇతర ప్రశ్నలపై సుబ్రహ్మణ్యం నుంచి సమాధానం రానట్లు సమాచారం. ఇక అజయ్‌కుమార్ సుగంధి కూడా చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. ‘డెయిరీలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు? అక్కడ నీ పాత్ర ఏమిటి? టీటీడీలో బాగా పరిచయమున్న అధికారుల పేర్లు చెప్పు. మీ డెయిరీ నుంచి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్లు తెలుసా? నీతో టీటీడీ అధికారులు ఎవరెవరు.. ఎన్నిసార్లు మాట్లాడారు? అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఏం మాట్లాడాడు. డెయిరీ నుంచి అతడికి ముడుపులు ఇచ్చారా’ అని సుగంధిని ప్రశ్నించగా, వీటిలో ప్రాథమిక అంశాలకు తప్ప కీలకమైన ప్రశ్నలపై సుగంధి మౌనంగా ఉన్నట్లు సమాచారం.
టీటీడీలో జీఎంలుగా పనిచేసిన అధికారులు తెలుసా అన్న ప్రశ్నకు.. వారితో తనకు ఏం సంబంధమని, ఏవైనా ఉంటే తమ యాజమాన్యం చూసుకుంటుందని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు సోమవారం నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతిచ్చిన విషయం విదితమే. పటిష్ట భద్రత మధ్య వారిని నెల్లూరు జైలు నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతికి తీసుకొచ్చారు. రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత టీటీడీ భూదేవి కాంప్లెక్సులోని సీబీఐ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి సాయంత్రం 6 గంటలకు వరకు విచారించారు. ఈ ఇద్దరిని మరో మూడు రోజుల పాటు విచారించనున్నారు. సుబ్రహ్మణ్యంకు అధిక రక్త పోటు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తెలిసింది.