Viveka case: వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తునకు ఓకే!
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:33 AM
మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు సీబీఐ కోర్టు పాక్షికంగా అనుమతించింది.....
పాక్షిక విచారణకు అనుమతించిన నాంపల్లి సీబీఐ కోర్టు
సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్‌తో వైఎస్ ప్రకాశ్‌రెడ్డి,అర్జున్‌రెడ్డి ఫోన్ సంభాషణలపైనే దర్యాప్తు
నెల రోజుల్లో పూర్తిచేయాలని సీబీఐకి నిర్దేశం
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు సీబీఐ కోర్టు పాక్షికంగా అనుమతించింది. ఈ కేసులోని అసలు సూత్రధారులు తప్పించుకోకుండా ఉండాలంటే మరోసారి సమగ్ర దర్యాప్తు చేయాలని గత నెల 21వ తేదీన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ వేయడం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయాధికారి టి.రఘురాం కొన్ని షరతులతో దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్, అతడి సోదరుడు కిరణ్ యాదవ్‌తో వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, వైసీపీ యువజన విభాగంలో కీలకంగా పని చేసిన ప్రకాశ్‌రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజ్‌ల డేటా ఆధారంగా నెల రోజుల లోపు విచారణ చేయాలని ఆదేశించింది. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి వేసిన పిటిషన్‌కు మద్దతుగా సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేయడం తెలిసిందే. పలు అంశాలపై సీబీఐ దర్యాప్తు అసమగ్రంగా ఉందని నిందితుల్లోనే కొందరు ప్రస్తావించడం, కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ సంసిద్ధత వ్యక్తం చేయడం, చట్టపరంగా దర్యాప్తు కొనసాగించడానికి అడ్డంకులు లేకపోవడంతో.. పాక్షిక విచారణకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాల్ రికార్డ్స్, డేటా ఆధారంగా దర్యాప్తు జరపాలని ఆదేశించింది.