Share News

CBI Court: వివేకా హత్య కేసు నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:31 AM

వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సంబంధించి అభిప్రాయాలు తెలియజేయాలని నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీచేసింది.

 CBI Court: వివేకా హత్య కేసు నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు

  • తదుపరి దర్యాప్తుపై అభిప్రాయాలు చెప్పాలని ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సంబంధించి అభిప్రాయాలు తెలియజేయాలని నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీచేసింది. తన తండ్రి హత్యకు సంబంధించి ఇంకా వెలుగు చూడాల్సిన అనేక విషయాలు ఉన్నాయని, సీబీఐ లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసిందని పేర్కొంటూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి టి. రఘురాం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.గౌతమ్‌ వాదనలు వినిపించారు. ‘తదుపరి దర్యాప్తు చేయాలన్న మా పిటిషన్‌ను విచారణార్హత పేరిట తిరస్కరించరాదని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అందరి వాదనలూ విని 8వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది’ అని తెలిపారు. కాగా, పిటిషన్‌పై తేల్చడానికి సుప్రీంకోర్టు సమయం నిర్దేశించిన నేపథ్యంలో ఈ నెల 27లోపు కౌంటర్లు దాఖలు చేయాలని నిందితులు టి.గంగిరెడ్డి (ఏ1), సునీల్‌ యాదవ్‌(ఏ2), ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), దస్తగిరి (ఏ4-అప్రూవర్‌), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5), గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి(ఏ6), వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (ఏ7), కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డితోపాటు ప్రతివాదిగా ఉన్న సీబీఐకి కూడా ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణను 27కు వాయిదా వేశారు. మరోవైపు వివేకా హత్యకు సంబంధించిన ప్రధాన కేసు సైతం గురువారం విచారణకు వచ్చింది. నిందితులు గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కోర్టుకు హాజరుకాగా మిగతావారు రాలేదు. తదుపరి విచారణ నవంబరు 10కి వాయిదా పడింది.

Updated Date - Oct 24 , 2025 | 03:32 AM