YS Jaganmohan Reddy: జగన్ తప్పుడు నంబర్ ఇచ్చారు
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:10 AM
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు (ఏ1), ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని...
కోర్టును తప్పుదోవ పట్టించారు
షరతులను ఉల్లంఘించారు
ఇక విదేశీ పర్యటనలకు అనుమతివ్వొద్దు
ప్రత్యేక కోర్టులో సీబీఐ వాదనలు
జగన్ అసలు ఫోనే వాడరు
గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నంబర్లే ఇచ్చారు
మాజీ సీఎం తరఫు న్యాయవాదుల వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సీబీఐ పేర్కొంది. తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లారని, కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపింది. ఇకపై ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది. అయితే జగన్ అసలు ఫోనే వాడరని.. గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తన సిబ్బంది ఫోన్ నంబర్లను ఇచ్చారని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. బుధవారం ఇరు పక్షాల వాదనలు ముగియడంతో.. తీర్పును 28వ తేదీన వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు జగన్ లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చింది. పర్యటన పూర్తి వివరాలతో పాటు ఆయన ఉపయోగించే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, అక్కడి బసకు సంబంధించిన సమాచారం సమర్పించాలని.. పర్యటన నుంచి తిరిగి వచ్చాక ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని స్పష్టంచేసింది. ఈ నెల 11వ తేదీన లండన్ వెళ్లిన జగన్‌కు.. సీబీఐ అధికారులు మూడు సార్లు ఫోన్ చేయగా ఆ నంబర్ పని చేయలేదు. దీంతో లండన్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు విధించిన బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని సీబీఐ గత వారం పిటిషన్ దాఖలు చేసింది. దానిపై బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయాధికారి టి.రఘురాం విచారణ జరిపారు. సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తప్పుడు నంబర్ ఇచ్చి కోర్టును జగన్ తప్పుదోవ పట్టించారని.. పర్యటన కోసం ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయడంతో పాటు మరోసారి విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు పర్మిషన్ ఇవ్వొద్దని గట్టిగా కోరారు. జగన్ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. అసలు ఆయన ఫోనే ఉపయోగించరని, గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది ఫోన్ నంబర్లే కోర్టుకు సమర్పించారని తెలిపారు. మరో మూడ్రోజులు అనుమతి ఉన్నా ముందుగానే పర్యటన ముగించుకుని జగన్ స్వదేశానికి తిరిగొచ్చేశారని తెలిపారు.