Share News

ACB Court: కసిరెడ్డి ఆరోగ్యంపై వైద్య బృందం ఏర్పాటు

ABN , Publish Date - Sep 24 , 2025 | 06:58 AM

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ACB Court: కసిరెడ్డి ఆరోగ్యంపై వైద్య బృందం ఏర్పాటు

  • పరీక్షల నివేదికను 6లోగా సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలి

  • ఏసీబీ కోర్టు ఆదేశాలు

విజయవాడ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి న్యాయాధికారి పి.భాస్కరరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి... అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. తాను బోన్‌మ్యారో సమస్యతో బాధపడుతున్నానని, దీనికి వైద్యం చేయించుకోకపోతే క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించడానికి ముందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజశేఖర్‌రెడ్డికి ఆ సమస్య ఉందో లేదో నిర్ధారించడానికి వైద్యనిపుణలతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజశేఖర్‌రెడ్డికి ఏరోజు పరీక్షలు చేస్తారో ఆ తేదీని జైలు సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు. అప్పుడు ఎస్కార్ట్‌ ద్వారా నిందితుడ్ని ప్రభుత్వాసుపత్రికి జైలు అధికారులు పంపుతారని తెలిపారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత నివేదికను వచ్చే నెల ఆరో తేదీలోగా కోర్టుకు సీల్డు కవర్‌లో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Sep 24 , 2025 | 06:59 AM