Share News

Water Dispute: పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంలో కేవియట్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:09 AM

పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన పథకంపై సుప్రీం కోర్టులో కేవియెట్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Water Dispute: పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంలో కేవియట్‌

  • దాఖలుకు రాష్ట్రం నిర్ణయం.. ప్రాజెక్టును అడ్డుకునేందుకు

  • తెలంగాణ కేసు వేసే యోచన నేపథ్యంలో అప్రమత్తం

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన పథకంపై సుప్రీం కోర్టులో కేవియెట్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేయాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను తయారు చేసేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ఇప్పటికే జలవనరుల శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఇందుకు తుది గడువు ఈ నెల 11వ తేదీతో ముగియగా, రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. జలవనరుల శాఖ వీటిని పరిశీలిస్తోంది. ఎల్‌-1గా వచ్చిన సంస్థకు డీపీఆర్‌ తయారీ బాధ్యతను అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య జల వివాదం పరిష్కారమయ్యేంత దాకా కొత్త ప్రాజెక్టులు కట్టకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్‌కాంతారావుకు శనివారం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి లేఖ రాశారు. పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన పథకం డీపీఆర్‌ను తయారు చేయకుండా నిలువరించాలని కోరారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో కేసు వేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో న్యాయపరమైన సంప్రదింపులు చేపట్టింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేలా జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం, కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీరుకు బాధ్యతలు అప్పగించింది. సుప్రీం కోర్టులో కేవియెట్‌ వేసే బాధ్యతలనూ అప్పగించింది. డీపీఆర్‌ తయారీని అడ్డుకునే హక్కు ఇతర రాష్ట్రాలకు ఉండదని జలవనరుల శాఖ చెబుతోంది. సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను దిగువ రాష్ట్రంగా సద్వినియోగం చేసుకుంటామని అంటోంది. ఈ హక్కును కాదనే అధికారం ఎవరికీ లేదని చెబుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తామని ‘ఆంధ్రజ్యోతి’కి జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టు కోసం డీపీఆర్‌ తయారు చేయకుండా నిలువరించాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ కేసు వేసినా న్యాయపరంగా నిలువబోదని అన్నారు.


పోలవరంలో రెండో రోజు సీఎస్ఎంఆర్‌ఎస్‌ బృందం పరీక్షలు

పోలవరం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో మట్టి, రాయి నాణ్యత పరీక్షలను శనివారం రెండో రోజూ సెంట్రల్‌ శాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చి సెంటర్‌ (సీఎస్ఎంఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాశ్‌, ఉదయ్‌ భాను చక్రవర్తి, సిద్ధార్థ్‌ పి.హెడవు ప్రాజెక్టు గ్యాప్‌ 1, 2 ప్రాంతాల్లో మట్టి నాణ్యత, రాయి పటిష్ఠతను పరీక్షించారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాంలో వినియోగించే మట్టి, రాయి నాణ్యత ప్రమాణాలనూ పరిశీలించారు. కొన్ని శాంపిల్స్‌ సేకరించారు. ఇంజనీరింగ్‌ చీఫ్‌ ఎన్‌.నరసింహమూర్తికి సేకరించిన శాంపిల్స్‌ స్వభావం గురించి వివరించి మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ బృందం ఆదివారం ఢిల్లీ బయల్దేరి వెళ్తుంది. కేంద్రం జల వనరుల శాఖకు ప్రాజెక్టు వద్ద నిర్వహించిన పరీక్షలపై నివేదిక ఇస్తుంది. బృందంతో పాటు ఈఈలు డి.శ్రీనివాస్‌, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎ.గంగాధర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేశ్‌, గణపతిరావు తదితరులు ఉన్నారు.

Untitled-2 copy.jpg

Updated Date - Dec 14 , 2025 | 04:13 AM