Share News

Private Buses: పొరుగు మార్గంలో ప్రైవేటు

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:19 AM

సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్‌లో ఓ ట్రావెల్‌ బస్సు దగ్ధమైంది. అంతకుముందు ఇతర రాష్ట్రాలలో పలు ప్రమాదాలు సంభవించాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

Private Buses: పొరుగు మార్గంలో ప్రైవేటు

  • ట్రావెల్స్‌ ప్రమాదాలకు కారణాలు ఎన్నెన్నో

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్‌లో ఓ ట్రావెల్‌ బస్సు దగ్ధమైంది. అంతకుముందు ఇతర రాష్ట్రాలలో పలు ప్రమాదాలు సంభవించాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే అన్నింటిలోనూ కొన్ని సరూప్యతలు ఉన్నాయి. ప్రమాదానికి గురైన ఈ ప్రైవేటు బస్సులన్నీ స్లీపర్‌ క్లాస్‌వి. ఇందులో కొన్ని బీఎస్‌-6 వాహనాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ రాత్రివేళ అందులోనూ తెల్లవారుజామున జరిగాయి. బస్సులు దగ్ధం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి? బీఎస్‌-6 వాహనాల్లో సమస్యలు ఏంటి? స్లీపర్‌ బస్సుల్లోని ప్రయాణికులు ప్రమాద సమయాల్లో త్వరగా బయటపడకుండా లోపలే చిక్కుకుపోవడానికి కారణాలేంటి? ప్రైవేటు ఆపరేటర్ల పాత్ర ఎంత? వంటి అంశాలను పరిశీలిస్తే.. ఎన్నో లోపాలు ఉన్నాయి..


ఈశాన్యంలో రిజిస్ట్రేషన్లు

రాష్ట్రానికి చెందిన ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అధిక శాతం ఈశాన ్య రాష్ర్టాల్లో రిజిస్ర్టేషన్లు చేయిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌తో పాటు డామన్‌ అండ్‌ డయ్యూ వైపు వెళుతున్నారు. ఈ రాష్ర్టాలలో రిజిస్ర్టేషన్లు చేయించుకుని ఆలిండియా పర్మిట్లు తీసుకుంటున్నారు. రిజిస్ర్టేషన్‌ ఎక్కడ చేయించినా ఆలిండియా పర్మిట్‌ తీసుకుంటే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రైవేటు బస్సులను నడుపుకొనే అవకాశం ఉంటుంది. ఏపీలో సింహభాగం ప్రైవేటు వాహనాలన్నీ నాగాలాండ్‌లోనే రిజిస్ర్టేషన్‌ చేయిస్తున్నారు. అక్కడైతే రోడ్‌ ట్యాక్స్‌ ఏడాదికి రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే మన రాష్ట్రంలో రిజిస్ర్టేషన్‌ చేయిస్తే ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అయితే ఆలిండియా పర్మిట్‌ ఏడాదికి కాకుండా ఐదు సంవత్సరాలకు కూడా ఇస్తున్నారు. నాగాలాండ్‌ లేదా ఇతర ఈశాన్య రాష్ర్టాలలో రిజిస్ర్టేషన్లు చేయించుకోవటం చాలా సులభం. వాహనం లేకపోయినా కేవలం వాట్సా్‌పలో కాగితాలు పంపిస్తే గంటల్లోనే రిజిస్ర్టేషన్లు జరిగిపోవడంతో పాటు నంబర్‌ సైతం వచ్చేస్తుంది. అక్కడ ఫిజికల్‌ వెరిఫికేషన్‌ పెద్దగా లేకపోవటం, ఫైర్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ సర్టిఫికెట్లు అడగకపోవటం వల్ల గంటల్లోనే పని అయిపోతుంది. మన రాష్ట్రం విషయానికొస్తే నిబంధనలు కఠినతరం. ఈ కారణాల వల్ల రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం పోవడమే గాక ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించిన ప్రైవేటు బస్సులపై అధికారం ఏపీ రవాణా శాఖకు పూర్తి స్థాయిలో ఉండదు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌, సెస్సుల భారం తగ్గడం కోసం ఇతర రాష్ర్టాలలో ఏ విధంగా డీజిల్‌ కొట్టించుకుంటున్నారో.. అదేవిధంగా రోడ్డు ట్యాక్స్‌ తగ్గించుకోవడం కోసం నాగాలాండ్‌ తదితర రాష్ర్టాలలో రిజిస్ర్టేషన్లు చేయించుకుంటున్నారు. ఈ అంశాలను రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రైవేటు వాహనాలు రాష్ట్రానికి చెందినవే అయినా.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం పొరుగు రాష్ర్టాలు తన్నుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఆదాయం సంగతి అటుంచితే.. ప్రమాణాలను పాటించకపోవటం వల్ల ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ల బస్సులు ఇక్కడి ప్రజలు, ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగినపుడే వ్యవస్థలోని లోపాలపై చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు అంతా మర్చిపోతారు.


అనుకూలంగా ఆలిండియా పర్మిట్‌

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు రవాణా ఆదాయం వేల కోట్లలో ఉంటోంది. ఉత్తరాదిలో తక్కువగా ఉండగా.. ఈశాన్యంలో మరీ తక్కువ. మన రాష్ట్రంలో ఒక బస్సు ఏడాది పాటు రోడ్లపై తిప్పాలంటే మూడు నెలలకు 1.64 లక్షలు రవాణా శాఖకు ఆపరేటర్‌ చెల్లించాలి. అదే ఈశాన్య రాష్ట్రాలైతే ఏడాదికి ఒకసారి 50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అక్కడ రిజిస్టరైన బస్సును ఏపీలో తిప్పడానికి ఆలిండియా పర్మిట్‌ (ఏడాదికి రూ.2లక్షలు) కేంద్రం జారీ చేస్తుంది. ఆ రెండు లక్షలు రాష్ట్రాలకే పంచుతామని చెప్పడంతో అందుకు రాష్ట్రాలు సమ్మతించాయి. తాజాగా కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైన ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌లో బయలుదేరింది. కర్నూలు, అనంతపురం మార్గంలో బెంగళూరుకు చేరాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక.. మూడు రాష్ట్రాలలో ప్రయాణించాలి. దీంతో కేంద్రం ఈ బస్సుకు సంబంధించి ఆ రెండు లక్షలు మూడు రాష్ట్రాలకూ పంపిణీ చేస్తుంది. ట్రావెల్‌ ఆపరేటర్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తక్కువ ఫీజులున్న ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని, ఎక్కువ ప్రయాణ చార్జీలు భరించే శక్తి ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బస్సులు నడుపుతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు.


బీఎస్‌-6 వాహనాలు.. ప్రమాదాలు

ఇటీవల బీఎస్‌-6 ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు తరచూ అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ వాహనాల్లో లోపాలు డ్రైవర్లకు అర్థం కావడం లేదు. గతంలో బస్సులలో ఏవైనా లోపాలుంటే రన్నింగ్‌లో డ్రైవర్లకు తెలిసేవి. బీఎస్‌-6 వాహనాలన్నీ ఎక్కువగా వైర్లు, సెన్సార్లతో పనిచేస్తున్నాయి. బస్సు ఆగిపోతే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తారు. వాహన తయారీ కంపెనీ ప్రతినిధి ల్యాప్‌టాప్‌ తీసుకుని వస్తే తప్ప సమస్య తెలుసుకోలేని పరిస్థితి. సర్వీసు సెంటర్లు తగినన్ని లేక బస్సు ఆగిన చోటుకు రావడానికే రెండు రోజులు పడుతోంది. వైరింగ్‌ వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. బీఎస్‌-6 బస్సులలో డీజిల్‌లో పొగ రాకుండా ఉండటం కోసం బ్లూ ఆయిల్‌ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. బ్లూ ఆయిల్‌కుచాలా త ్వరగా మండే స్వభావం ఉంటుంది. దీంతో ప్రమాద సమయాల్లో పేలుడు సంభవిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. బీఎస్‌-6 వాహనాలలో అద్దాలను కదలకుండా ఫిక్స్‌ చేయటం వల్ల కూడా ప్రమాద సమయాల్లో ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకోలేక పోతున్నారు.


స్లీపర్‌ బస్సుల్లో డిజైన్‌ లోపాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్లీపర్‌ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి డిజైన్లలో లోపాలు ముఖ్య కారణమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్‌ బస్సుల్లో 36 వరకూ బెర్తులుంటే మల్టీ యాక్సిల్‌ బస్సుల్లో 40వరకూ ఉంటాయి. డ్రైవర్‌ వెనక నుంచి రెండు బెర్తులు అనుసంధానించి బస్సు చివరి వరకూ ఆరు వరుసలు పైనా, కిందా ఉంటాయి. అదేవిధంగా బస్సుకు ఎడమ వైపు సింగిల్‌ బెర్తులు కింద ఒకటి, పైన మరొకటి ఉంటాయి. వాటి మధ్యలో నడవాలంటే ప్రయాణికులకు దారి చిన్నగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కిందికి దిగాలంటే డబుల్‌ బెర్తుల్లో కిటికీ వైపు ఉండే ప్రయాణికుడికి ఇటు వైపు ఉండే ప్రయాణికుడు దారిస్తే కానీ సాధ్యం కాదు. అలాగాకుండా గతంలో ఉన్న డిజైన్ల(అడ్డంగా)లో బెర్తులు రూపొందిస్తే అన్నీ సింగిల్‌ ఉంటాయి గనుక దిగేందుకు సులభంగా ఉంటుంది. ప్రమాద సమయాల్లో వీలైనంత త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ డిజైన్‌ వల్ల బెర్తుల సంఖ్య తగ్గిపోతుందని ట్రావెల్‌ ఆపరేటర్లు అభ్యంతరాలు చెప్పడంతో వాహన తయారీ కంపెనీలు డిజైన్‌ మార్చేశాయి. డిజైన్లపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించి చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 05:20 AM