Mystery Deaths in Turakapalem: తురకపాలెం కథతేలేదెన్నడు..!?
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:05 AM
తురకపాలెంలో ఏం జరుగుతోందో అంతుచిక్కడం లేదు..! ఈ గ్రామంలో మూడు నెలల వ్యవధిలోనే 29 మంది మృతిచెందడం సాధారణ విషయం కాదు.
మొన్న కలుషిత సెలైన్ అంటూ అనుమానం
నేడు యురేనియం ఆనవాళ్లు తెరపైకి..
అసలు కారణం గుర్తించడంలో ఆరోగ్యశాఖ విఫలం
అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): తురకపాలెంలో ఏం జరుగుతోందో అంతుచిక్కడం లేదు..! ఈ గ్రామంలో మూడు నెలల వ్యవధిలోనే 29 మంది మృతిచెందడం సాధారణ విషయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న ప్రకారం వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామంలో నెలలో నలుగురు మరణిస్తేనే అనుమానించాలి. దాన్నో హెచ్చరికగా భావించాలి. అలాంటిది మూడు నెలల వ్యవధిలో 29 మంది చనిపోయారంటే.. ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. అదేమిటో గుర్తించాలి. కానీ.. ఈ విషయంలో స్థానిక ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. మీడియా వెలుగులోకి తీసుకొచ్చే వరకూ అధికారులు ఆ గ్రామాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ మిస్టరీ మరణాలకు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్నారు కానీ.. అసలు కారణమేంటో తేల్చలేకపోతున్నారు. తొలుత జ్వరాలకు మోలియోయిడోసిస్ ఇన్ఫెక్షన్ కారణమన్నారు. మొన్న కలుషిత సెలైన్ వల్లే అని అనుమానించారు. తాజాగా యురేనియం అంటూ.... ఎవరికి తోచింది వారు చెబుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ మరణాలకు కారణమేంటే తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కూడా ఇప్పటివరకూ నివేదిక ఇవ్వలేదు. ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆగ్రికల్చర్ రిసెర్చ్), ఎన్‌సీడీసీ (నేషనల్ కమ్యూనికబుల్ డిసీజ్ కౌన్సిల్) నుంచి ఇప్పటి వరకూ నివేదికలు కాలేదు. ఇదే సమయంలో గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య బృందం కూడా కొన్ని శాంపిల్స్‌ను పరీక్షించింది. ఐపీఏఆర్, ఎన్‌సీడీసీతోపాటు గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య బృందం సమర్పించే నివేదికను క్రోడీకరించి డాక్టర్ ఏ సిరి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అప్పటివరకూ మిస్టరీ మరణాల వెనుక కారణాలు బయటకు రావని నిపుణులు అంటున్నారు.
యురేనియం కాదు..: ఆరోగ్యశాఖ
తురకపాలెం మరణాలు నీటిలో యురేనియం కలవడం వల్ల సంభవించినవి కాదని ఆరోగ్యశాఖ స్పష్టంగా చెబుతోంది. నీటిలో యురేనియం 0.3 శాతంపైన ఉంటేనే ప్రమాదమని, తురకపాలెంలో సేకరించిన నీటిలో 0.001 శాతమే గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఉండదన్నారు. మరోవైపు ఆరోగ్యశాఖ పరిధిలో ఉండే నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. తురకపాలెంలో 29 మంది మరణిస్తే, విజయవాడ సింగ్‌నగర్‌లో 151 మంది డయేరియా బారినపడ్డారు. శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలకు అకస్మాత్తుగా మోకాళ్ల సమస్యలు వస్తున్నాయి. మొన్న పాడేరు సమీపంలోని కొన్ని గ్రామాల్లో వంద మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే ఆరోగ్యశాఖలోని ఐడీఎ్‌సపీ (ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రొగ్రామ్) స్పందించి... వాటికి కారణాలు గుర్తించాలి. కానీ ఈ విషయంలో ఐడీఎ్‌సపీ వెనుకబడింది. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంల పనితీరు కూడా సక్రమంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో సర్వేలెన్స్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.