Share News

ఫాస్ట్‌ట్యాగ్‌తో పట్టుకున్నారు

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:19 AM

రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడి మరణానికి కారణమైన కారు యజమానిని మాచవరం పోలీసులు ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా పట్టు కున్నారు. పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో నిందితుడు లొంగిపోయాడు.

ఫాస్ట్‌ట్యాగ్‌తో పట్టుకున్నారు

ఈ నెల 3న ఎంజీ రోడ్డులో రోడ్డు ప్రమాదం

ఒకరు మృతి.. కారు ఆపకుండా వెళ్లిపోయిన నిందితుడు

పోలీసులకు సాంకేతికంగా చిక్కిన వైనం

విజయవాడ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి):

రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడి మరణానికి కారణమైన కారు యజమానిని మాచవరం పోలీసులు ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా పట్టు కున్నారు. పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో నిందితుడు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే... ఈ నెల మూడో తేదీన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో యువకులు రహదారులపై విజయోత్సవాలు చేశారు. ఈ ఘటనలో ఒక యువకుడు విజయవాడ ఎంజీ రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వించిపేట ఇస్మాయిల్‌పేటకు చెందిన తాడిగిరి శేఖర్‌బాబు(30), స్నేహితులు ఉదయ్‌కుమార్‌, గొల్లవరపు శ్రీనాథ్‌ బైక్‌పై ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనాథ్‌ బైక్‌ నడుపుతుండగా వెనుక వైపున శేఖర్‌బాబు, ఉదయ్‌కుమార్‌ కూర్చున్నారు. బైక్‌కు ఒక్కసారిగా ఎక్సలేటర్‌ ఇవ్వడంతో పక్కన ఉన్న బైక్‌కు హ్యాండిల్‌ తగిలింది. దీనితో బైక్‌పై ఉన్న శేఖర్‌బాబు, ఉదయ్‌కుమార్‌ రోడ్డుపై పడిపోయారు. వెనుక వస్తున్న ఎరుపు రంగు బెంజ్‌ కారు శేఖర్‌బాబుపైనుంచి వెళ్లిపోయింది. పక్కనే ఉన్న వ్యక్తి ఇది గమనించి హెల్మెట్‌తో కారుపై బలంగా కొట్టారు. మొత్తం అందరూ తనపై దాడి చేస్తారన్న భయంతో కారు యజమాని వేగంగా వెళ్లిపోయాడు. కారుకు నంబరు బోర్డు లేకపోవడంతో సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు కనిపించినా ఫలితం లేకపోయింది.

100 సీసీ కెమెరాల పరిశీలన

ఈ కేసులో నిందితుడ్ని ఎలాగైనా అరెస్టు చేయాలని అధికారుల నుంచి మాచవరం పోలీసులకు ఆదేశాలు అందాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 100 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. మొత్తం కారు వెళ్లిన మార్గాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు కీసర టోల్‌గేట్‌ వద్ద నిందితుడ్ని గుర్తించారు. పల్నాడు జిల్లాకు చెందిన కె.కిరణ్‌ను నిందితుడిగా నిర్థారించారు. కిరణ్‌ బేకరీ నిర్వహిస్తున్నాడు. అతడు తన స్నేహితుడితో కలిసి మూడో తేదీన రాత్రి హైదరాబాద్‌కు వెళ్లడానికి పల్నాడు నుంచి బయలుదేరాడు. ఎంజీ రోడ్డులో ఐపీఎల్‌ విజయోత్సవాలు జరుగుతుండడంతో వాటిలో పాల్గొనడానికి కారును ఈ మార్గంలో తిప్పాడు. సరిగ్గా ఎంజీ రోడ్డులో శ్రీచైతన్య కళాశాల వద్ద శేఖర్‌బాబుపై నుంచి కారు ఎక్కించాడు. తర్వాత అక్కడి నుంచి వేగంగా వేర్వేరు రూట్లలో హైదరాబాద్‌ రహదారిపైకి వెళ్లాడు. కీసర టోల్‌గేట్‌ వద్ద టోల్‌ చెల్లించడానికి ఆగడాడు. ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించాడు. విజయవాడ నుంచి ఒక సీసీ కెమెరా నుంచి మరో సీసీ కెమెరాను అనుసంధానం చేసుకుంటూ వెళ్లిన మాచవరం పోలీసులకు కీసర టోల్‌ ప్లాజా వద్ద కారు యజమాని కిరణ్‌ ఆధారాలు లభించారు. హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత కారుకు మరమ్మతులు చేయించడానికి మాదాపూర్‌లోని ఓ షెడ్‌లో ఉంచాడు. కారును పరిశీలించగా ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ కారును పెట్టేసిన తర్వాత కిరణ్‌, అతడి స్నేహితుడు పల్నాడుకు చేరుకున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌లో ఉన్న సెల్‌ నంబరు ఆధారంగా కిరణ్‌ను అరెస్టు చేశారు. ప్రమాదం తానే చేసినట్టుగా పోలీసుల ముందు అంగీకరించాడు. తనపై మిగిలిన వారు దాడి చేస్తారన్న భయంతోనే పారిపోయినట్టు వివరించాడని తెలిసింది.

Updated Date - Jun 12 , 2025 | 01:19 AM