Dasari Kiran Kumar: దౌర్జన్యాల దాసరి
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:48 AM
మాజీ సీఎం జగన్ అనుచరుడు, వైసీపీ కథలతో సినిమాలు నిర్మించిన దాసరి కిరణ్ కుమార్‌ను కేసులు వెంటాడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో బాధితులైనవారు
పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు
విజయవాడ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ అనుచరుడు, వైసీపీ ‘కథ’లతో సినిమాలు నిర్మించిన దాసరి కిరణ్ కుమార్‌ను కేసులు వెంటాడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో బాధితులైనవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో కిరణ్‌పై నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. సొంత బంధువు నుంచి రూ.4.50 కోట్లు అప్పుగా తీసుకుని దాన్ని తిరిగి చెల్లించమని అడిగినందుకు అనుచరులతో దాడి చేయించిన విషయం తెలిసిందే. దీనిపై నమోదైన కేసులో కిరణ్‌తోపాటు ఆయన అనుచరులు స్టేషన్ బెయిల్ ఉన్నారు. ఇక, ఆ తర్వాత కిరణ్ బాధితులు పటమట పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కిరణ్.. రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో చెలరేగిపోయారు. హైదరాబాద్‌లో ఒకరికి భూమి విక్రయించడానికి అడ్వాన్స్ తీసుకుని, దానిని మరొకరికి విక్రయించారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితులపై కిరణ్ అధికార జులుం ప్రదర్శించారు. పటమటకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకు స్థలాన్ని విక్రయిస్తానని చెప్పి రూ.50 లక్షలు తీసుకున్న కిరణ్.. తర్వాత ఆ భూమిని మరొకరికి విక్రయించారు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వమని కోరిన ఆయనను బెదిరించారు. తాజాగా బాధితుడు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోవకు చెందిన బాధితుల్లో మరొకరు రామవరప్పాడులో ఉన్నట్టు తెలిసింది.
ఎవరీ కిరణ్?: దాసరి కిరణ్ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కూటమిలోని ఓ పార్టీ ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కిరణ్‌ను జగన్ టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నియమించారు. కేఎల్ వర్సిటీ అధినేత కుమారుడితో చిత్రాన్ని నిర్మించి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.