Flood Misinformation: వరద దుష్ప్రచారంపై కేసులు
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:14 AM
ప్రజలను భయభ్రాంతులను చేసేలా.. కొండవీటి వాగు, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని, పొన్నూరు, విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తనుందని...
వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడా
కొండవీటి వాగు వరదను గుంటూరు చానల్‌కు మళ్లించారని జగన్
చానల్లో కథనం.. పొన్నూరును ముంచేశారని తప్పుడు ప్రచారం
ప్రకాశం బ్యారేజీ గేటు విరిగింది.. బెజవాడకు వరద ముప్పుందంటూ
సుమన్ టీవీ ప్రసారం.. తప్పుడు కథనాలపై ఇంజనీర్ల కేసులు
అమరావతి/గుంటూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలను భయభ్రాంతులను చేసేలా.. కొండవీటి వాగు, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని, పొన్నూరు, విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తనుందని తప్పుడు ప్రచారానికి తెరదీసిన వైసీపీ అనుకూల మీడియాపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆ ప్రాజెక్టుల గేట్లు పనిచేయడం లేదంటూ రెండ్రోజులుగా వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ముంపు బారిన పడకుండా అమరావతిని రక్షించుకునేందుకు కొండవీటి వాగు వరద నీటిని గుంటూరు, అప్పాపురం చానళ్లకు మళ్లించారని.. దీంతో పొన్నూరులో వేల ఎకరాలు మునిగాయని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. జగన్ మీడియాలో ఈ మేరకు కథనాలు వండివార్చారు కూడా. ఈ ప్రచారాన్ని జలవనరుల శాఖ అధికారులు ఖండించారు. అసలు గుంటూరు చానల్‌కు నీరే వదల్లేదని స్పష్టం చేశారు. వర్షాలతో స్థానిక డ్రెయిన్లు, కాల్వల ద్వారా ప్రవాహాలు వచ్చి చేరినట్లు తెలిపారు. పొన్నూరు మునుగుతోందంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై కొండవీటి వాగు ప్రాజెక్టు ఏఈఈ సీహెచ్ అవినాశ్ ఆదివారం తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాక్షి టీవీ న్యూస్, ఇతరులపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద బీఎన్‌ఎస్ 353(1) సెక్షన్, 54వ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ప్రకాశం బ్యారేజీ గేటు పనిచేయడం లేదంటూ మరో అసత్య కథనం ప్రసారం చేసిన సుమన్ టీవీపైనా అధికారులు ఫిర్యాదు చేశారు. 67వ నంబరు ఖానా వద్ద గేటు పనిచేస్తోందని స్పష్టం చేశారు. ‘విరిగిపోయిన 67వ గేటు.. భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉంది’ అంటూ ప్రసారం చేసిన సుమన్ టీవీ న్యూస్ తెలుగు చానల్‌పై ఏఈఈ సత్యరాజేశ్ శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్‌ఎస్ 353(1), 54 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. తప్పుడు కథనాలపె వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కూడా కేసు నమోదైంది.
పోలవరంపైనా..
పోలవరంఎగువ కాఫర్ డ్యాంలో స్వల్పంగా కుంగిన ప్రాంతాన్ని జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే సరిచేశారని, అయినా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాఫర్ డ్యాం మరమ్మతు చేశామని ఇప్పటికే వివరాలను విడుదల చేశామని గుర్తుచేశారు.
అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తే బడితె పూజ ఖాయం
క్రిమినల్ కేసులు పెడతాం..రైతు జేఏసీ హెచ్చరిక
‘వర్షాలు పడితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో రోడ్లన్నీ మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా తయారవుతుంది. కానీ ఈ రాజధానులపై ఆ రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ విమర్శలు చేయలేదు.. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అభాండాలు వేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్న ఇక్కడ వారిని ఏం చేయాలి’ అని రాజధాని అమరావతి రైతులు ధ్వజమెత్తారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో అమరావతి ముంపునకు గురవుతుందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడంపై వారు మండిపడ్డారు. మీడియా గానీ, వ్యక్తులు గానీ ఇలా అసత్య ప్రచారాలు చేస్తే బడితె పూజ ఖాయమని.. క్రిమినల్ కేసులు పెడతామని రాజధాని రైతుల జేఏసీ హెచ్చరించింది. ముంపునకు గురైతే సచివాలయం, హైకోర్టు ఎలా నడుస్తున్నాయని జేఏసీ నేతలు ఆలూరి శ్రీనివాసరావు, కంచర్ల గాంధీ, ఇ.సీతారామయ్య తదతరులు ఆదివారం ఓ ప్రకటనలో నిలదీశారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై రాకపోకలు నిరంతరాయంగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు అమరావతిపై విషం చిమ్మాలని చూస్తే సహించేది లేన్నారు.