Van Driver Dispute: హైకోర్టు ఆదేశాలతో మంగళగిరి రూరల్ సీఐపై కేసు
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:17 AM
హైకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుపై శనివారం అదే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 25న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే..
హైకోర్టు వ్యాన్ డ్రైవర్‌ను అడ్డుకున్న వివాదంలో ఫిర్యాదు
గుంటూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుపై శనివారం అదే పోలీ్‌సస్ట్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 25న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే సభకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్ వద్ద ఆ రోజు ఇరువురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండగా హైకోర్టుకు సంబంధించిన ఓమ్నీ వ్యాన్ అక్కడకు వచ్చింది. కానిస్టేబుళ్లు ఆ వ్యాన్‌ను ఆపినప్పుడు డ్రైవర్‌కు, కానిస్టేబుళ్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్‌కు వ్యాన్‌ను తగిలించడమే కాకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారని డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తనపై చేయి చేసుకున్నారని, వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారని డ్రైవర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. హైకోర్టు ఫైల్స్‌తో వస్తున్న డ్రైవర్‌పై సీఐ చేయి చేసుకోవడం, కారును స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను పిలిపించి వివరణ తీసుకుంది. డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తగుచర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం సీఐ శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.