Share News

Forest Department Assault: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై కేసు

ABN , Publish Date - Aug 23 , 2025 | 06:03 AM

ఆటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో నమోదైన కేసులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ఏ-2గా చేర్చారు. శ్రీశైలం జనసేన ఇన్‌చార్జి రౌతుఅశోక్‌ను ఏ1గా నమోదుచేశారు.

Forest Department Assault: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై కేసు

అటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో ఏ-2గా చేర్చిన పోలీసులు

ఏ1గా జనసేన ఇన్‌చార్జి రౌతు అశోక్‌

నంద్యాల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో నమోదైన కేసులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ఏ-2గా చేర్చారు. శ్రీశైలం జనసేన ఇన్‌చార్జి రౌతుఅశోక్‌ను ఏ1గా నమోదుచేశారు. చెక్‌పోస్టు వద్ద తనకు దారి వదలలేదని అటవీశాఖకు చెందిన పెట్రోలింగ్‌ టీమ్‌పై తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భౌతికదాడికి పాల్పడటం, అటవీశాఖ సిబ్బందిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. దీంతో శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీసులు చట్టపర చర్యలకు సిద్ధమయ్యారు. అందరికంటే అశోక్‌ తమపై ఎక్కువగా దాడి చేశారని అటవీశాఖ సిబ్బంది చెప్పడంతో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరికొంత సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆటవీశాఖ ఉద్యోగులను శ్రీశైలంలోని ఎమ్మెల్యే అతిథి గృహంలో(గొట్టిపాటి నిలయం) నిర్బంధించారు. గంటల తరబడి వేధింపులకు గురిచేశారు. మరోవైపు ఎమ్మెల్యే బుడ్డా వ్యవహారం ఇప్పటికే సీఎం దృష్టికి వెళ్లింది. పోలీసుల వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం ఆదేశాల మేరకు లోతుగా విచారణ చేసి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Updated Date - Aug 23 , 2025 | 06:04 AM