Nellore Police: జగన్ పత్రికపై కేసు
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:49 AM
జగన్ పత్రికలో ఈ నెల 8న నకిలీ మద్యానికి నలుగురు బలి అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎక్సైజ్ శాఖ తీవ్రంగా స్పందించింది.
ఎడిటర్, ప్రచురణకర్తలపై నెల్లూరు జిల్లాలో నమోదు
కల్తీ మద్యానికి నలుగురు బలి కథనంపై స్పందించిన ఎక్సైజ్
నెల్లూరు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జగన్ పత్రికలో ఈ నెల 8న నకిలీ మద్యానికి నలుగురు బలి అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎక్సైజ్ శాఖ తీవ్రంగా స్పందించింది. తమ శాఖ పరువుకు భంగం కలిగించేలా తప్పుడు వార్త రాశారని సాక్షి ఎడిటర్, ప్రచురణ కర్తలు, నెల్లూరు జిల్లా విలేకరులపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచురించిన కథనానికి సంబంధించి ఆధారాలతో సోమవారం విచారణకు హాజరు కావాలని నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు.. జగన్ పత్రిక ఎడిటర్, ప్రచురణ కర్తలు, నెల్లూరు జిల్లా విలేకరులకు నోటీసులు జారీ చేశారు. చనిపోయిన నలుగురిలో నెల్లూరు రూరల్, కలిగిరిలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఎక్సైజ్ శాఖ పరువు, ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాసిన తప్పుడు కథనమని ఎక్సైజ్ అధికారులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల్లూరు ఎక్సైజ్ సీఐ రమేశ్‌బాబు, కలిగిరి ఎక్సైజ్ సీఐ అబ్దుల్ జలీల్‌లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.