Ponnru Police: జగన్ మీడియాపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:50 AM
అసత్య కథనాలు ప్రసారం చేసి పరువుకు భంగం కలిగించిన ఘటనలో బాధితుని ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
అసత్య కథనాలపై పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
పొన్నూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): అసత్య కథనాలు ప్రసారం చేసి పరువుకు భంగం కలిగించిన ఘటనలో బాధితుని ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. అర్బన్ సీఐ ఎల్ వీరానాయక్ కథనం ప్రకారం... ‘పొన్నూరు పట్టణానికి చెందిన లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య పోలీసులకు జగన్ పత్రికపై ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో చెన్నయ్య చోరికి పాల్పడినట్లు జగన్ మీడియాలో కథనాలు ప్రచురించారు. ప్రసారం చేశారు. అంతే కాకుండా ఒంగోలు పోలీసులు చెన్నయ్య గృహంలో తనిఖీలు నిర్వహించి వెండి నగదు స్వాధీనం చేసుకున్నట్లు నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. అంతే కాకుండా ఈ కథనంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై అత్యంత హేయమైన అభూత కల్పనలతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ పత్రికలో ఉద్దేశపూర్వకంగా తనను, ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ను ప్రజల దృష్టిలో చులకన చేసే విధంగా ప్రచారం చేశారని, జగన్ టీవిలో వచ్చిన ప్రసారాన్ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అర్బన్ పోలీసులు జగన్ మీడి యా ప్రతినిధులు తలారి సురేంద్రనాథ్, వై అశోక్‌వర్థన్, యాజమాన్యం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ వివరించారు.