Share News

నిర్లక్ష్యంగా..

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:11 AM

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. దీపావళి పండుగ తర్వాత వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తుగా వరినాట్లు పూర్తి చేసిన కంకిపాడు మండలం, వెద పద్ధతి సాగు చేసిన బంటుమిల్లి, పెడన, గూడూరు, మచిలీపట్నం, పామర్రు తదితర ప్రాంతాల్లోని పైరు వరి కోతకు సిద్ధమవుతోంది. అయితే ధాన్యం కొనుగోలులో కీలకంగా ఉన్న మిల్లర్లు ప్రభుత్వానికి ఎంతమేర సహకరిస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. బుధవారం నాటికి బ్యాంకు గ్యారెంటీలు చూపాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినా చూపకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్లక్ష్యంగా..

- బ్యాంకు గ్యారెంటీలు చూపని రైస్‌ మిల్లర్లు

- నెలాఖరు నాటికి వరి కోతలు ప్రారంభం!

- జిల్లాలో 165 మిల్లులు.. డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్నవి 75

- నేటిలోగా బ్యాంకు గ్యారెంటీ చూపాలని గతంలోనే అధికారుల ఆదేశాలు

- కావాలనే జాప్యం చేస్తున్న మిల్లు యజమానులు!

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. దీపావళి పండుగ తర్వాత వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తుగా వరినాట్లు పూర్తి చేసిన కంకిపాడు మండలం, వెద పద్ధతి సాగు చేసిన బంటుమిల్లి, పెడన, గూడూరు, మచిలీపట్నం, పామర్రు తదితర ప్రాంతాల్లోని పైరు వరి కోతకు సిద్ధమవుతోంది. అయితే ధాన్యం కొనుగోలులో కీలకంగా ఉన్న మిల్లర్లు ప్రభుత్వానికి ఎంతమేర సహకరిస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. బుధవారం నాటికి బ్యాంకు గ్యారెంటీలు చూపాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినా చూపకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా వ్యాప్తంగా 165 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్న మిల్లులు 75 వరకు ఉన్నాయి. నవంబరు మొదటి వారం నుంచి ముందస్తుగా వరినాట్లు వేసిన పొలాల్లో వరి కోతకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది వారం, పది రోజుల ముందుగానే ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఈ నెల 15వ తేదీలోగా మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు చూపాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లులు సకాలంలో చెల్లించాలంటే మిల్లు యజమానులు ముందస్తుగానే బీజీలు చూపాల్సి ఉంది. మిల్లుల ఖాతాల్లో నగదు ఉంటేనే ప్రభుత్వం ధాన్యం బిల్లులు చెల్లించేందుకు సర్వర్‌ సహకరిస్తుంది. ధాన్యానికి రైతులు ఆశించిన మద్దతు ధర ఇచ్చే జిల్లాలోని ఏ మిల్లుకైనా ధాన్యం విక్రయించే వెసులుబాటును ఈ ఏడాది కల్పించారు. దీంతో అన్ని మిల్లుల యజమానులు బీజీలు చెల్లిస్తేనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. అయితే కొందరు మిల్లర్లు బీజీలు చూపేందుకు ముందు, వెనుకా ఆలోచిస్తుండటంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు కొంతమేర ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్ల్లాలో పలు ప్రాంతాల్లో ఒకే సారి వరి కోతలు ప్రారంభమై, వాతావరణం అనుకూలించకుంటే తేమశాతం అధికంగా ఉన్నా ధాన్యం విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతారు. డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్న మిల్లులకు తేమశాతం అధికంగా ఉన్న ధాన్యం తరలిస్తారు. మిల్లు యజమానులు బీజీలు చూపకుంటే సంబంధిత మిల్లులకు ధాన్యం తరలించేందుకు అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పౌరసరఫరాలసంస్థ అధికారులు మిల్లర్లు త్వరితగతిన బీజీలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ కొందరు మిల్లర్లు కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం.

11.65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి

ఈ ఏడాది జిల్లాలో 1.54 లక్షల హెక్టార్లలో ఇప్పటి వరకు వరి సాగు జరిగింది. దివిసీమ ప్రాంతంలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో ఇంకా వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 11.65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనాగా ఉంది. ఇందులో 7.90 లక్షల టన్నుల వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో 6.50 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది అదనంగా 1.40 లక్షల టన్నులను కొనుగోలు చేసేందుకు అనుమతులు ప్రభుత్వం నుంచి ముందస్తుగానే అధికారులు తెచ్చారు. ఈ ఏడాది ధాన్యం మద్దతు ధరను ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకం ధాన్యం రూ.2,369గా నిర్ణయించింది. జిల్లాలో 287 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు.

నేటి నుంచి మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు

ఖరీఫ్‌ సీజన్‌ 2025-26 సంవత్సరంలో జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లలో ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు, మిల్లర్లు, తహసీల్దార్‌లు, వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులకు శిక్షణ ఇచ్చారు. ధాన్యం సేకరణపై అవగాహన సదస్సుల్లో కలెక్టర్‌ బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. డివిజన్‌ స్థాయిలో ధాన్యం కొనుగోలుపై శిక్షణా కార్యక్రమాలు పూర్తికాగా, మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తేమశాతం కొలిచే యంత్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, మిల్లుల వద్ద ఒకేరకమైనవి అందుబాటులో ఉంచాలని, బియ్యంలో నాణ్యతను తెలుసుకునేందుకు మినీ మిల్లింగ్‌ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:11 AM