నిర్లక్ష్యపు జాడ్యం!
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:08 AM
జిల్లా పరిషత కార్యాలయానికి నిర్లక్ష్యపు జాడ్యం పట్టుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆరు నెలల కాలంలో పది మంది వరకు జూనియర్ అసిస్టెంట్లు బదిలీపై వస్తే నేటి వరకు వారికి సీట్లు కేటాయించకపోవడంతో రోజూ వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన డీడీవోల జీపీఎఫ్, ఎంపీడీవోల సర్వీస్‌మేటర్, ఉద్యోగుల పీఎఫ్ తదితర ఫైళ్లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- జిల్లా పరిషతలో అస్తవ్యస్తంగా పాలన
- బదిలీపై ఆరు నెలల కాలంలో 10 మంది జూనియర్ అసిస్టెంట్ల రాక
- నేటి వరకు కేటాయించని విధులు, బాధ్యతలు!
- కార్యాలయానికి వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్తున్న ఉద్యోగులు
- పెండింగ్‌లో డీడీవోల జీపీఎఫ్, ఎంపీడీవోల సర్వీస్‌మేటర్, ఉద్యోగుల పీఎఫ్ ఫైళ్లు
- జెడ్పీలో అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
జిల్లా పరిషత కార్యాలయానికి నిర్లక్ష్యపు జాడ్యం పట్టుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆరు నెలల కాలంలో పది మంది వరకు జూనియర్ అసిస్టెంట్లు బదిలీపై వస్తే నేటి వరకు వారికి సీట్లు కేటాయించకపోవడంతో రోజూ వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన డీడీవోల జీపీఎఫ్, ఎంపీడీవోల సర్వీస్‌మేటర్, ఉద్యోగుల పీఎఫ్ తదితర ఫైళ్లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం:
జిల్లా పరిషతకు ఆరు నెలలు, మూడు నెలలు, గత 20 రోజుల వ్యవధిలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులు 10 మందికిపైగా బదిలీపై వచ్చారు. వీరికి ఇంత వరకు ఎక్కడ పనిచేయాలో చెప్పకుండా, జెడ్పీలోని వివిద విభాగాలకు కేటాయించకుండా అధికారులు వదిలేశారు. దీంతో బదిలీపై వచ్చిన ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే వీరిని కొన్ని సెక్షన్‌లలో ఒకటీ రెండు రోజులు వాడుకుని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో పదిమందికిపైగా ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్లిపోతున్నారు. జెడ్పీ అధికారులు మాత్రం బదిలీపై వచ్చిన ఉద్యోగులకు ఆయా విభాగాల్లో సీట్లు మాత్రం కేటాయింకుండా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్ పంపిన ఫైళ్లను జెడ్పీ సీఈవో నిబంధనలకు విరుద్ధమని పక్కన పెట్టడం, సీఈవో నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ వద్దకు వెళ్లిన ఫైళ్లు ఆమోదానికి నోచుకోకపోవడం ఆనవాయితీగా మారిందని జెడ్పీ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.
అధికారుల సర్వీస్ మేటర్ ఫైళ్లు పెండింగ్‌లోనే..
జిల్లా పరిషతలో గత రెండు, మూడు సంవత్సరాలుగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పరిపాలనలో అనుభవం ఉండి, పైళ్లను చకాచకా తయారు చేసే నైపుణ్యం ఉన్న సీనియర్ ఉద్యోగులంతా వివిధ కారణాలతో జిల్లా పరిషత కార్యాలయం నుంచి బయటి ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. వారి స్థానంలో జూనియర్‌లు వచ్చారు. వీరికి ఆయా సెక్షన్‌లలో పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించకపోవడంతో జిల్లాపరిషత యాజమాన్యంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫైళ్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉండి పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
డీఎల్‌డీవోలు స్వయంగా వచ్చి ఫైళ్లు చూసుకునే దుస్థితి
ఇటీవల కాలంలో డీఎల్‌డీవో(డీడీవో)లకు సంబంధించి జీపీఎఫ్ పైళ్లు జిల్లా పరిషతకు వచ్చాయి. వీటిని సరిచూసి పంపాల్సి ఉండగా పెండింగ్‌లో పెట్టారు. దీంతో డీఎల్‌డీవోలు స్వయంగా జెడ్పీ కార్యాలయానికి వచ్చి సంబంధిత ఫైళ్లను సరిచేసుకున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాల వివరాలు తెలియజేసేవారే లేరని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఫైళ్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండి పోయాయని ఉద్యోగులు అంటున్నారు. జిల్లాలో పనిచేసే ఎంపీడీవోల సర్వీస్ మేటర్ ఫైళ్లు కూడా ధీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఎంపీడీవోలు జెడ్పీ డిప్యూటీ సీఈవో వద్దకు వెళ్లి లేదా పోన్‌లో సంప్రదించి తమ సర్వీస్‌మేటర్‌లకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తిచేయాలని పదేపదే కోరుతున్నారని తెలిసింది.
సూపరింటెండెంట్ల పదోన్నతుల వేళ జాప్యమే!
మండల పరిషత కార్యాలయాల్లో పనిచేసే సూపరింటెండెంట్లకు పదోన్నతులు ఇచ్చే సమయంలో గత రెండు, మూడు సంవత్సరాలుగా వారి పనితీరు, ఎదుర్కొన్న ఆరోపణలు, అవినీతి అంశాలు, ఏసీబీ కేసులు తదితర వివరాలు గుట్టుచప్పుడు కాకుండా తెలుసుకుని ఉన్నతాధికారులకు అన్ని ఆధారాలతో నివేదికలు పంపాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయాల నుంచి ఈ నివేదికలు ముందస్తుగానే పంపగా, కృష్ణాజిల్లా నుంచి మాత్రం ఆలస్యంగా పంపారని జిల్లా పరిషత యాజమాన్యంలో పనిచేసే ఉద్యోగులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. జిల్లా పరిషతలో పరిపాలన సజావుగా సాగేందుకు ఖాళీగా ఉంటున్న ఉద్యోగులకు సీట్లు కేటాయించి, వారితో పనిచేయిస్తేనే పరిపాలన కొంతమేర అయినా గాడిలో పడుతుందని, జిల్లాస్థాయి అధికారులు ఈ అంశంపై దృష్టిసారించాలని జెడ్పీ ఉద్యోగులు కోరుతున్నారు.