Share News

చల్లపల్లిలో కారు బీభత్సం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:39 AM

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ బజారులో సోమవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

చల్లపల్లిలో కారు బీభత్సం

- పురిటిగడ్డ పీహెచ్‌సీ హెల్త్‌ సూపర్‌వైజర్‌ దుర్మరణం

- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

- జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలింపు

చల్లపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ బజారులో సోమవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ బజారులో వెళుతున్న కారు ఇనుప దుకాణాల సమీపంలో ఒక్కసారిగా టూవీలర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నానమ్మ, మనవరాలిని ఢీకొని వేగంగా ముందుకువెళ్లి పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఆ వ్యక్తి బానెట్‌పై పడిపోగా, కారు ఆగకుండా వేగంతో కొద్దిదూరం వెళ్లి మండపాన్ని బలంగా ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో పురిటిగడ్డ పీహెచ్‌సీలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నాగాయలంకకు చెందిన నందిగామ కమలాకరరావు(60) కారుబానెట్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కారు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న గెల్లి రాధాకృష్ణకు గాయాలయ్యాయి. హోటల్‌, ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్న కూతాడి నాగమల్లేశ్వరి, ఆమె మనమరాలు జనీలియా తీవ్రంగా గాయపడ్డారు. తొలుత వారిని 108 అంబులెన్స్‌లో చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా, ప్రాథమిక చికిత్స అనంతరం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి స్థానిక పొట్టిశ్రీరాములు వీధిలోని వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకుడు శ్రీనివాసరావుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి సైతం గాయాలుకాగా, అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కారు కొత్తగా నేర్చుకుం టున్నాడనీ, పూర్తిస్థాయిలో అనుభవం రాలేదని చెబుతున్నారు. సమాచారం అదుకున్న పోలీసులు కారును సీజ్‌ చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:39 AM