Share News

Ramulu Incident: ఎవర్ని చంపడానికి వచ్చారు

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:00 AM

ఎవరిని చంపడానికి వచ్చారు.. మీ సానుభూతి మాకొద్దు.. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వల్లే రాములు చనిపోయాడు.. అంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సమక్షంలో..

Ramulu Incident: ఎవర్ని చంపడానికి వచ్చారు

  • మీ సానుభూతి మాకొద్దు

  • ఎమ్మెల్యే వల్లే రాజధాని రైతు రాములు మృతి

  • పెమ్మసాని సమక్షంలో బంధువుల ఫైర్‌

  • ఫోన్‌లో రాములు కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ

తుళ్లూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎవరిని చంపడానికి వచ్చారు.. మీ సానుభూతి మాకొద్దు.. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వల్లే రాములు చనిపోయాడు..’ అంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సమక్షంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై రాములు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఎన్‌-8 రహదారి విషయమై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ల నేతృత్వంలో జరిగిన సమావేశంలో మాట్లాడి.. ఆ వెంటనే గుండెపోటుకు గురై దొండపాటి రామారావు (రాములు) మరణించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి పెమ్మసాని.... రాములు మృతికి నివాళులు అర్పించేందుకు రాములు స్వగ్రామం మంద డం వచ్చారు. రాములు బంధువులు వారిని నిలదీశారు. రోడ్డు కింద ఇళ్లు పోకుండా పక్కకు జరిపితే ఏమౌతుందంటూ రాములు బావమరిది జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వల్లే మా బావ చనిపోయాడ’ంటూ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఆయనను పెమ్మసాని ఓదార్చారు. బంధువులకు సర్ది చెప్పారు. మంత్రి నారాయణ కూడా రాములు ఇంటికి వచ్చి నివాళి అర్పించారు. రాములు భార్య, కుమారుడు, కుమార్తెలతో సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. రాములు మృతి దురదృష్టకరమని, అండగా ఉంటామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ అందుబాటులో ఉంటారని, ఏ కష్టం వచ్చినా వారిని కలవొచ్చునంటూ ధైర్యం చెప్పారు.

Updated Date - Dec 28 , 2025 | 05:01 AM