Drug Mafia: గంజాయి డాన్ కామాక్షి ఇంట్లో కత్తి
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:49 AM
గంజాయి డాన్ అరవ కామాక్షి ఇంట్లో మారణాయుఽధం బయటపడింది. పాత ఫ్రిజ్‌లో పొడవాటి కత్తి కనిపించింది.
పాత ఫ్రిజ్‌లో బయటపడ్డ మారణాయుధం
నెల్లూరు రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గంజాయి డాన్ అరవ కామాక్షి ఇంట్లో మారణాయుఽధం బయటపడింది. పాత ఫ్రిజ్‌లో పొడవాటి కత్తి కనిపించింది. కామాక్షి ఆగడాలపై స్థానికులు కొందరు ఆగ్రహించి సోమవారం రాత్రి ఆమె ఇంటిని, అనుచరుల ఇళ్లను నేలమట్టం చేశారు. విషయం తెలుసుకుని మంగళవారం అక్కడకు వెళ్లిన పోలీసులకు.. కత్తి కంటపడింది. తమిళనాడుకు చెందిన కామాక్షి నెల్లూరు బోడిగాడితోట వద్ద తన నేర సామ్రాజ్యానికి పునాది వేసుకుంది. భర్త జోసెఫ్, తమ్ముడు జేమ్స్, చెల్లెలు భర్త, అనుచరులతో గ్యాంగ్ తయారు చేసుకుని, గంజాయి విక్రయాలను ప్రారంభించింది. 2022లో అప్పటి కలెక్టరు రోడ్డు విస్తరణలో భాగంగా బోడిగాడితోట వాసులందరికీ రూరల్ మండలంలోని కల్లూరుపల్లి వద్దనున్న ఆర్డీటీ కాలనీలో ఇళ్లు కేటాయించారు. కామాక్షితోపాటు ఆమె అనుచరులకూ ఇళ్లు వచ్చాయి. కానీ ఆమె బోడిగాడితోటలోనే ఉంటూ, నేరాలకు వ్యూహాలు పన్నేది. గంజాయి దిగుమతి, ఎగుమతికి మాత్రం ఆర్డీటీ కాలనీని అడ్డాగా చేసుకుంది. తన ఆగడాలను అడ్డుకున్నందుకే సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసి.. తమ గ్యాంగ్ జోలికి వచ్చిన పోలీసులపైన కూడా దాడులు చేయించిందని చెబుతున్నారు. పెంచలయ్య హత్యతో కామాక్షి నేర సామ్రాజ్యం వెలుగు చూసింది. గంజాయిని ప్యాకెట్లలో నింపి కల్లూరుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులకు కామాక్షి అమ్మేదని స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు కూడా గంజాయి ప్యాకెట్లు అమ్మేదని చెప్తున్నారు. గత నెల హౌసింగ్‌బోర్డు కాలనీ ఎంఐజీలో ఒంటరి వృద్ధ మహిళ రుక్మిణమ్మ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని 12 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. ఈ ఘటనలోనూ కామాక్షికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రైల్వే ఆస్తులను అనుచరగణంతో చోరీ చేయించి, తనకున్న పాత సామాన్ల దుకాణం ద్వారా బయట ప్రాంతాలకు కామాక్షి అమ్మేదని పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది.