Share News

అంతరపంటగా గంజాయి

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:46 PM

ఎకరాలకు ఎకరాల్లో గంజాయి సాగు.. ట్రాక్టర్ల కొద్ది తరలింపు.. చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా ఓ రైతు ఏకంగా గంజాయి పంటను సాగు చేశాడు. కంది, మిరప అంతర పంటలుగా గంజాయి సాగు చేశాడు.

   అంతరపంటగా గంజాయి
గంజాయి సాగు చేసిన పంట పొలాన్ని పరిశీలిస్తున్న పోలీసు, ఎక్సైజ్‌, వ్యవసాయశాఖల అధికారులు

మిరప, కందిపంటల నడుమ సాగు

కర్నూలు జిల్లా డేగలహాల్‌లో భారీగా స్వాధీనం

గుర్తించిన పోలీసులు, పరారీలో రైతు

చిప్పగిరి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎకరాలకు ఎకరాల్లో గంజాయి సాగు.. ట్రాక్టర్ల కొద్ది తరలింపు.. చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా ఓ రైతు ఏకంగా గంజాయి పంటను సాగు చేశాడు. కంది, మిరప అంతర పంటలుగా గంజాయి సాగు చేశాడు. అది కూడా ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూమిలో విస్తారంగా గంజాయి సాగుచేయడం గమనార్హం. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని మారుమూల గ్రామమైన డేగలహాళ్‌లో ఓ పొలంలో భారీగా సాగవుతున్న గంజాయి పంటను శుక్రవారం పోలీసులు గుర్తించారు. గ్రామంలో సర్వేనంబర్‌ 176లోని ఆంజనేయస్వామి ఆలయానికి 30 ఎకరాల మాన్యం భూమి ఉంది. అందులో అదే గ్రామానికి చెందిన ఉనేబాద్‌ శివయ్య 4 ఎకరాలను కంది, మిరప పంటను సాగు చేసుకునేందుకు వేలంలో లీజుకు తీసుకున్నాడు. అయితే ఆ పంటల్లో అంతర పంటగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని సాగు చేయడం మొదలు పెట్టాడు. అయితే గ్రామానికి చెందిన కొందరికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రవిశంకర్‌ రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ లలితదేవి, వ్యవసాయశాఖ ఏడీ చెంగలరాయుడు, ఎస్‌ఐ సతీష్‌, తహసీల్దార్‌ ఎజాజ్‌ అహ్మద్‌, ఆర్‌ఐ సునీత శుక్రవారం గ్రామానికి చేరుకుని పొలాన్ని పరిశీలించారు. అక్కడకు వెళ్లిన అధికారులు భారీగా సాగవుతున్న గంజాయిని చూసి అవాక్కయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా డేగలహాళ్‌ గ్రామంలోనే ఉండి పంటలను కోసి ట్రాక్టర్‌కు తరలించారు. దాదాపుగా 300 మొక్కలు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను ట్రాక్టర్‌లో చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి సాగు చేసిన రైతు శివయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్న శివయ్య వెనుక ఎవరి హస్తం ఉందోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అదే గ్రామ సమీపంలో ఉన్న ఏరూరు గ్రామంలో కూడా గంజాయి సాగును అప్పట్లో పోలీసులు గుర్తించారు. గంజాయి సాగు ఎన్ని రోజుల నుంచి సాగుతుంది... సాగు చేసిన గంజాయిని ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Updated Date - Dec 19 , 2025 | 11:46 PM