ఫోన్ కాల్స్, మెసేజ్ సిఫార్సులు రద్దు
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:10 AM
దసరా ఉత్సవాలలో సామాన్య భక్తులకు ఇబ్బందిగా మారుతున్న ప్రొటోకాల్ దర్శనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ కాల్స్, మెసేజ్ సిఫార్సులు రద్దు చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సూచించింది. అర్హత కలిగిన వారు ముందస్తుగా లేఖలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది.
- దుర్గగుడిలో ప్రొటోకాల్ దర్శనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇక మీదట ముందస్తుగా లేఖలు ఇస్తేనే పరిగణనలోకి..
- మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి నిర్దేశించిన ప్రభుత్వం
- దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో చర్చించిన మంత్రి ఆనం
- పలు కీలక అంశాలపై నిర్ణయాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
దసరా ఉత్సవాలలో సామాన్య భక్తులకు ఇబ్బందిగా మారుతున్న ప్రొటోకాల్ దర్శనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ కాల్స్, మెసేజ్ సిఫార్సులు రద్దు చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సూచించింది. అర్హత కలిగిన వారు ముందస్తుగా లేఖలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గగుడి ఈవో శీనా నాయక్‌తో గురువారం సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రోటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధులు నేరుగా తమ కుటుంబ సభ్యులతో వస్తే వారికి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. అదే ప్రజా ప్రతినిధులు లేకుండా అయితే సిఫార్సు లేఖలు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. సిఫార్సు లేఖలతో వచ్చే వారు మాత్రం ఖచ్చితంగా వీఐపీ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిఫార్సు లేఖ తీసుకున్న వారి వివరాలను ప్రజా ప్రతినిధుల ఓఎస్డీలు ముందుగా దేవస్థానానికి తెలియపరచాల్సి ఉంటుంది. ఎంత మంది వస్తున్నారు? వారి పేర్లు ఏమిటి? ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్లు, వారు వస్తున్న వాహనం నెంబరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ముందస్తుగా సమాచారం ఇస్తే.. దేవదాయ శాఖ అధికారులే వారికి ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో తెలుసుకుని దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రొటోకాల్ ఇబ్బందులు లేకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్శనానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు కూడా ప్రొటోకాల్ టీమ్ వారి వెంట ఉండి ఇబ్బందులు లేకుండా చూస్తుంది.
న్యాయమూర్తులకు ఇదే విధానం అమలు
దసరా ఉత్సవాలలో ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వారిలో న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి అనుసరిస్తున్న విధానం న్యాయమూర్తుల విషయంలో కూడా అమలు చేస్తారు. న్యాయమూర్తులు కూడా వారు స్వయంగా వారి కుటుంబ సభ్యులతో వస్తే ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తారు. వారెవరికైనా సిఫార్సు చేయాల్సి వస్తే.. ముందుగా పైన చెప్పుకున్నట్టుగానే లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయమూర్తుల సిఫార్సు లేఖలపై వచ్చే వారు కూడా విధిగా వీఐపీ టికెట్ తీసుకోవాల్సిందే.
ఎంత మందికి అవకాశం?
ప్రొటోకాల్ దర్శనాల విషయంలో ప్రభుత్వం ఆలోచన బాగుంది. ఇదే క్రమంలో ఎంత మందిని అనుమతించాలన్న దానిపై స్పష్టత రాలేదు. ఏటా ప్రజాప్రతినిధులు 25 నుంచి 50 మందితో దుర్గగుడికి వస్తుంటారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే సిఫార్సు లేఖలలో కూడా ఎంత మందికి అనుమతిస్తారన్న దానిపై దేవస్థాన అధికారులు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ నూతన విధానం కూడా బెడిసికొట్టే ప్రమాదం ఉంది.