Share News

MD K. Satyanarayana Raju: దేశ ప్రగతిలో కెనరా బ్యాంకుది ముఖ్య భూమిక

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:20 AM

దేశ ప్రగతిలో కెనరా బ్యాంకు ముఖ్య భూమిక పోషిస్తున్నదని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కె.సత్యనారాయణరాజు అన్నారు. శనివారం ఆయన విశాఖపట్నంలోని...

MD K. Satyanarayana Raju: దేశ ప్రగతిలో కెనరా బ్యాంకుది ముఖ్య భూమిక

  • ఎండీ కె.సత్యనారాయణ రాజు

  • విశాఖలో బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలు ప్రారంభం

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతిలో కెనరా బ్యాంకు ముఖ్య భూమిక పోషిస్తున్నదని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కె.సత్యనారాయణరాజు అన్నారు. శనివారం ఆయన విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో కెనరా బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ‘కెనరా’ ఒకటన్నారు. బ్యాంకు అభివృద్ధిలో ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. తెలుగు యువకుడైన రవికుమార్‌ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు అధికారులంతా ఏకతాటిపై నడిచి అందిస్తున్న సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.రవికుమార్‌ మాట్లాడుతూ ఐకమత్యమే తమ బలమని, అదే తమను దేశంలో రెండో అతి పెద్ద ట్రేడ్‌ యూనియన్‌గా నిలిపిందన్నారు. బ్యాంకు అధికారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, దేశ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం సత్యనారాయణరాజు జీవితంలో ఎదిగిన క్రమాన్ని వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆయన మాతృమూర్తి రామసీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్దీప్ సింగ్‌ అహ్లూవాలియా, విజయవాడ సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ విజయలక్ష్మి, కమిటీ చైర్మన్‌ రమాప్రసాద్‌, దేశవ్యాప్తంగా ఉన్న అసోసియేషన్‌ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 06:20 AM