కేబుల్ వ్యర్థం
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:03 AM
గుణదల నుంచి నున్న వెళ్లే మార్గంలో జరుగుతున్న 220 కేవీ విద్యుత లైన్ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. మీటరు రూ.18 వేలు ఖరీదు చేసే కేబుల్‌ను కాంట్రాక్టు సంస్థ కొలతలు లేకుండా ఇష్టారాజ్యంగా కట్ చేయడంతో ఆ కేబుల్ ముక్కలు ముక్కలై ఎందుకుపనికిరాకుండా పోతోంది. ట్రాన్స్‌కో అధికారుల పర్యవేక్షణలోపంతో ప్రభుత్వానికి భారీగా నష్టం ఏర్పడుతోంది.

- గుణదల-నున్న 220 కేవీ విద్యుత లైన్ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం
- ఖరీదైన కేబుల్‌ను అడ్డగోలుగా కట్ చేస్తున్న కాంట్రాక్టు సంస్థ
- ముక్కలై పనికిరాకుండా పోతున్న కేబుల్ వైర్లు
- ట్రాన్స్‌కో అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వానికి తీరని నష్టం
గుణదల నుంచి నున్న వెళ్లే మార్గంలో జరుగుతున్న 220 కేవీ విద్యుత లైన్ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. మీటరు రూ.18 వేలు ఖరీదు చేసే కేబుల్‌ను కాంట్రాక్టు సంస్థ కొలతలు లేకుండా ఇష్టారాజ్యంగా కట్ చేయడంతో ఆ కేబుల్ ముక్కలు ముక్కలై ఎందుకుపనికిరాకుండా పోతోంది. ట్రాన్స్‌కో అధికారుల పర్యవేక్షణలోపంతో ప్రభుత్వానికి భారీగా నష్టం ఏర్పడుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
నగరంలో గుణదల నుంచి నున్న మార్గంలో 220 కేవీ విద్యుత లైన్‌ను వేస్తున్నారు. ఇది అత్యంత శక్తివంతమైన లైన్ కావడంతో ఎక్స్‌ఎల్‌పీఈ కేబుల్‌ను ఉపయోగిస్తారు. ఈ కేబుల్ లోపల రాగి ఉంటుంది. ఈ కేబుల్ ధర మీటరు రూ.18 వేలు. కిలోమీటరుకు రూ.1.80 కోట్లు చొప్పున ఖర్చుపెట్టి ట్రాన్స్‌కో అధికారులు ఈ కేబుల్‌ను కొనుగోలు చేస్తున్నారు. ట్రాన్స్‌కో కొనుగోలు చేసిన ఖరీదైన కేబుల్‌ను వేసే పనుల నిమ్తితం ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ ఈ కేబుల్‌ను ఇష్టానుసారంగా ఉపయోగిస్తోంది. ఖరీదైన కేబుల్‌ను కట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎక్కడ అవసరమో అక్కడే కట్ చేయాలి. కానీ సదరు సంస్థ ఎడాపెడా కట్ చేయటం వల్ల ఖరీదైన కేబుల్ కాస్తా ముక్కలు ముక్కలుగా పనికిరాకుండా పోతోంది. ఈ కేబుల్స్‌ను కాంట్రాక్టు సంస్థ ట్రాక్టర్లలో వేసుకుని తరలిస్తున్న దృశ్యాలు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి. దాదాపుగా రెండు డజన్లకు పైగా ట్రాక్టర్లలో తరలించారు. ఒక్కో కేబుల్ ముక్క ఐదు మీటర్ల వరకు ఉంది. ఒక్కో ముక్క ఖరీదు రూ.90 వేలు. ఈ ముక్కల విలువ రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఇలాంటి ముక్కలను ఎన్ని ట్రిప్పుల్లో తరలించారో ఊహిస్తే భారీగానే ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత చిన్న కేబుల్స్‌ను మళ్లీ ఉపయోగించటానికి పనికిరావు. ఈ ముక్కలు స్ర్కాప్ కింద పోతాయి. అక్కడ కేబుల్ ముక్క రూ.2 వేల ధర మాత్రమే పలుకుతుంది. ఎంతో విలువైన కేబుల్‌ను సరైన కొలత ప్రకారం కట్ చేసి ఉంటే ఇంత భారీ నష్టం జరగటానికి అవకాశం ఉండదు. కేబుల్ మనం కొన్నది కాదు కదా అని ఇష్టానుసారంగా కట్ చేయటం వల్ల తలెత్తిన నష్టం ఇది. ట్రాన్స్‌కో అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వల్ల జరుగుతున్న ఆగం ఇది. రేపు అమరావతిలో చేపట్టే పనులలో కూడా ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వంపై కోట్లాది రూపాయల భారం పడే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.