AP Cabinet Sub Committee: 2 కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లె..
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో ఇప్పుడున్న 26 జిల్లాలకు కొత్తగా మరో రెండు అదనంగా చేరనున్నాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది.
కొత్త రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు
ముఖ్యమంత్రితో భేటీ-నివేదిక సమర్పణ
కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు
అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటకు మార్పు
పశ్చిమ గోదావరికి నరసాపురం
ఆదోనిలో కొత్త మండలంగా పెద్దహరివాణం
అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశంలోకి!
డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ
పోలవరం ముంపు మండలాలతో.. ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై వెనుకడుగు
అలా వద్దని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ఏ జిల్లాలో ఉంచాలో నేడు కీలక నిర్ణయం
రెవెన్యూ శాఖ నివేదికపై చర్చించి చంద్రబాబుతో మళ్లీ సబ్‌కమిటీ భేటీ
ఆయన ఆమోదముద్ర పడిన వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ
అభ్యంతరాలు, సూచనలకు నెల గడువు
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పుడున్న 26 జిల్లాలకు కొత్తగా మరో రెండు అదనంగా చేరనున్నాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. ఉపసంఘం సభ్యులు సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను సమర్పించారు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలవరం ముంపు మండలాలతో తొలుత ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా ముఖ్యమంత్రి సూచనలతో ఉపసంఘం వెనక్కి తగ్గింది. ఈ అంశంపై మరోసారి సమావేశమై తగిన నిర్ణయం తీసుకుని ఆయనకు నివేదించనుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా దీనిపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం నివేదికను రూపొందించింది.
27వ జిల్లాగా మదనపల్లె..
విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకా రం కొత్తగా ఉమ్మడి చిత్తూరులో ఉన్న మదనపల్లెను, ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక. జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు కూడా. ఈ మేరకు ఉపసంఘం కూడా 21 మండలాలతో మదనపల్లెను 27వ జిల్లాగా ప్రతిపాదించింది. ఇందులో మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో 9 మండలాలు(మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెర్వు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట).. కొత్తగా ఏర్పాటుచేసే పీలేరు డివిజన్‌లో 12 మండలాలు (సదుం, సోమల చౌడేపల్లి, పుంగనూరు, రొంపిచర్ల, పులిచెర్ల, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె, కలకిరి, వాల్మీకిపురం) ఉంటాయి. కొత్త జిల్లా పరిధిలో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించారు.
28వ జిల్లాగా మార్కాపురం..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం పెద్ద రెవెన్యూ డివిజన్. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేయాలన్నది ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్. తాము అధికారంలోకి వస్తే జిల్లాను చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఉపసంఘం సిఫారసు చేసింది. ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని సూచించింది. ఇందులో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. గిద్దలూరును కొత్త డివిజన్‌గా ప్రతిపాదించినా.. ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు డివిజన్లకే పరిమితం కానున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో 21 మండలాలను ప్రతిపాదించారు. వీటిలో మార్కాపురం డివిజన్‌లోని 9 మండలాలు (యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు).. కనిగిరి డివిజన్‌లోని 12 మండలాలు (హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్ద చెర్లోపల్లె, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు).. ఉంటాయి. గిద్దలూరు డివిజన్‌పై వెనుకడుగు వేసిన నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గంలోని మండలాలను ఏ జిల్లాలో ఉంచాలో మంగళవారం ఉపసంఘం ఖరారు చేయనుంది.
కొత్తగా 4 రెవెన్యూ డివిజన్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటికి అదనంగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిరను డివిజన్లుగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం సిఫారసు చేసింది. పక్షం రోజుల క్రితం జరిగిన సమావేశంలో కొత్తగా 9-10 డివిజన్ల కోసం ప్రతిపాదలు వచ్చాయి. ఉపసంఘం సభ్యులుగా ఉన్న కొందరు మంత్రుల నియోజకవర్గ కేంద్రాలను కూడా డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్న సూచనలూ వచ్చాయి. అయితే అధికారులు, ఉద్యోగుల కొరత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేవలం 4 డివిజన్లనే ఉపసంఘం ప్రతిపాదించినట్లు తెలిసింది. నక్కపల్లి అనకాపల్లి జిల్లాలోది. పాయకరావుపేట నియోజకవర్గ మండలాలు ఇందులో ఉండనున్నాయి. వీటి ఏర్పాటుతో మొత్తం 81 రెవెన్యూ డివిజన్లు అవుతాయు. అయితే గిద్దలూరు డివిజన్ విషయంలో పునరాలోచన చేసి ప్రభుత్వం ఆమోదిస్తే అప్పుడు అది కూడా కొత్త డివిజన్ కానుంది. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 679 మండలాలున్నాయి. కర్నూలు జిల్లాల ఆదోని మండలాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా పెద్దహరివనం మండలం ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది.
‘ముంపు’ అథారిటీపై పునరాలోచన:
పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని ఉపసంఘం సిఫారసు చేసిన ట్లు తెలిసింది. అయితే దీనిపై మంత్రుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కూడా ఈ ప్రతిపాదనపై విముఖత చూపినట్లు సమాచారం. ప్రత్యేక అథారిటీతో ఏం ఉపయోగం ఉంటుందని ఆయన ప్రశ్నించగా.. అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. పైగా.. తమను వేరు చేశారన్న భావన ముంపు ప్రాంతాల ప్రజలకు వచ్చే అవకాశం ఉందని, ఇది సరైనది కాదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ముంపు మండలాలను నిర్దిష్ట జిల్లాలోనే కొనసాగించాలని.. అయితే అది ఏ జిల్లా అయితే బాగుంటుందో తగిన నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘానికి సూచించారు. ఏలూరులో కలుపుతారా.. లేక వాటి పూర్వపు జిల్లాల్లోనే కొనసాగిస్తారా అనేది ఆలోచన చేయాలని ఆదేశించారు. ఈ నేపఽథ్యంలో ఉపసంఘం సభ్యులు సీఎం కార్యాలయ ప్రాంగణంలోనే మరోసారి సమావేశమయ్యారు. ముంపు మండలాల స్థితిగతులపై చర్చించారు. కొన్ని ప్రతిపాదనలు చర్చకొచ్చినా మరోసారి మంగళవారం సీఎంను కలిసి ఆ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
జిల్లా కేంద్రాల మార్పు..
అన్నమయ్య జిల్లాకు రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కానీ జగన్ సర్కారు నాడు రాయచోటిని జిల్లా కేంద్రం చేసింది. ఇప్పుడు రాజంపేటనే జిల్లా కేంద్రంగా మార్చాలని ఉపసంఘం సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే పశ్చిమ గోదావరికి భీమవరం బదులు నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
నేడు నోటిఫికేషన్లు..
పోలవరం ముంపు మండలాల అంశంపై రెవెన్యూ శాఖ మంగళవారం ఉదయానికి ఉపసంఘానికి నివేదిక ఇవ్వనుంది. అనంతరం ఉపసంఘం సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ముఖ్యమంత్రికి నివేదించనుంది. అన్ని ప్రతిపాదనలకూ ఆయన ఆమోదం తెలిపాక వెంటనే రెవెన్యూ శాఖ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలం ఏర్పాటుపై ప్రాఽథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలో వీటిని జారీ చేయనుంది. వీటితోపాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణపైనా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై ప్రజల నుంచి నెల రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉండగా.. ఉపసంఘం సిఫారసులను ఆమోదిస్తే మొత్తం 28 జిల్లాలు, 81 డివిజన్లు, 680 మండలాలు అవుతాయి.
బాపట్ల జిల్లా నుంచి అద్దంకి మళ్లీ ప్రకాశంలోకి!
నూజివీడు, గన్నవరం నియోజకవర్లాల్లోని నాలుగేసి మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో విలీనం?
కైకలూరులోని 4 మండలాలు కృష్ణా జిల్లాలోకి
గూడూరు డివిజన్‌లో 4 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాకు
కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలు మళ్లీ ప్రకాశంలో విలీనం!
పలు డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణకు ఉపసంఘం ప్రతిపాదన
భౌగోళిక, సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు డివిజన్లు, మండలాలను జిల్లాల నడుమ పునర్వ్యవస్థీకరించాలని ఉపసంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ఆ ప్రతిపాదనల్లో కొన్ని కీలకమైనవి ఇవీ..
అద్దంకి నియోజకవర్గం ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆ నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి. అలాగే అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి.
అల్లూరి జిల్లా చింతూరు, రంపచోడవరం డివిజన్లను తూర్పుగోదావరిలోకి తీసుకురావాలి (ఈ ప్రతిపాదనపై సీఎం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది)
మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలను తూర్పుగోదావరిలో విలీనం చేయాలి.
కాజులూరు మండలాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలపాలి.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, అగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలను ఎన్టీఆర్ జిల్లాలో, ఏలూరు జిల్లాలోనే కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాలను కృష్ణా జిల్లాలో కలపాలి.
కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ గన్నవరం నియోజకర్గ పరిధిలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి.
తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లోని గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాకు తేవాలి.
కందుకూరు డివిజన్‌లోని రెండు మండలాలు, ఆత్మకూరులోని రెండు మండలాలను కావలి డివిజన్‌లో విలీనం చేయాలి. దీనివల్ల ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
కందుకూరు డివిజన్‌లోని కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలె ం మండలాలను తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నింద్ర, విజయపురం, నగరి మండలాలను తిరుపతి జిల్లాలోకి తీసుకురావాలి.