AP CM Chandrababu: ఫేక్‌లపై ఉక్కుపాదం
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:32 AM
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు.. పోస్టుల నివారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
తప్పుడు ప్రచారాలపై ఉదాసీనత వద్దు.. సోషల్ మీడియా కట్టడికి చట్టం
విధివిధానాల కోసం ఉపసంఘం.. తప్పుడు విమర్శలు చేస్తే కఠినచర్యలు
కూటమి నేతలను ఎవరు విమర్శించినా కలిసికట్టుగా స్పందించండి
క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
‘ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రభుత్వంపై కానీ.. పాలకులపై కానీ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. అలాకాకుండా ప్రభుత్వంపై ద్వేషంతో విమర్శలు చేస్తే వాటిని ఎట్టి పరిసితుల్లోను ఉపేక్షించకూడదు. అలా తప్పుడు ప్రచారాలు.. తప్పుడు పోస్టులు పెట్టే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి.’’
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు.. పోస్టుల నివారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. చట్టం విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వంపైన, కూటమి నేతలపైన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై లోతైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్త చట్టం రూపకల్పనపై ఉపసంఘం దృష్టి సారిస్తుందని సీఎం పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ అది శ్రుతి మించకూడదన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచేవారికి ఆధార్ అకౌంటబిలిటీ లాంటిది ఉండేలా చట్టం తీసుకురావాలని పలువురు మంత్రులు సూచించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. సామాజికమాధ్యమాల కట్టడికి న్యూజిలాండ్‌లో బలమైన చట్టాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు కూడా ఇచ్చిందని, వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలని మనోహర్ సూచించారు.
తిప్పికొట్టకపోతే ప్రభుత్వానికి దెబ్బ: కుప్పానికి కృష్ణా జలాలు అందిస్తుంటే ఓర్వలేని వైసీపీ నాయకులు నీళ్లే రావడం లేదంటూ ఫేక్ పోస్టులతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, యూరియాపైనా అలాంటి తప్పుడు ప్రచారాలే చేసి, రైతులను తప్పుదారి పట్టిస్తూ వారిని ఆందోళనకు గురి చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారని సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి డ్యామేజి జరగకముందే మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాల్సిన అవసరం ఉందని, వారే చొరవ తీసుకుని ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించాలని సూచించారు. సుగాలిప్రీతి తల్లి ఆరోపణలపై సీఎం స్పందిస్తూ... సుగాలి ప్రీతి కుటుంబం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకు చివరికి రాజకీయంగా తననే లక్ష్యంగా చేసుకుంటున్నారని, స్వార్థరాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఈ రోజే లేఖ పంపాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.
డీఆర్సీ సమావేశాల నిర్వహణపై ఇన్‌చార్జి మంత్రులకు, కలెక్టర్లకు మధ్య సమన్వయం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం లో ఎక్కడైనా పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తే, వారిని ప్రోత్సహించాలని, భూసమీకరణ కింద భూములు తీసుకుని, రైతులను పరిశ్రమల్లో భాగస్వాములను చేసే విషయాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఇకపై అనధికార కట్టడాలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి శాటిలైట్ ఇమేజ్‌లను తీసుకుని ఎక్కడ అనధికార కట్టడాలు ఉన్నాయో గుర్తించి వెంటనే తొలగించాలని.. అక్రమనిర్మాణాల క్రమబద్ధీకరణపై చర్చ సందర్భంగా సీఎం కోరారు.
కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు
జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్రానికి అభినందలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థికవ్యవస్థను వేగంగా ముందుకు వెళ్లేలా చేస్తాయని, భారత్ త్వరలోనే ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు.
కలిసి గట్టిగా తిప్పికొట్టాలి..
కూటమిపై ఎలాంటి విమర్శలు వచ్చినా అందరు కలిసి గట్టిగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందని, కానీ అలా చేయలేకపోయామని సీఎం అభిప్రాయపడ్డారు. సుగాలి ప్రీతి తల్లి పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసినప్పుడు కూడా అందరం స్పందిస్తే బాగుండేదని అన్నారు. ‘అందరం కలిసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఎన్డీయే భాగస్వాములమనే విషయాన్ని విస్మరించొద్దు.’ అని మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు సూచించారు.
కార్యకర్తల కోసం ప్రత్యేక గ్రీవెన్స్
మంత్రులతో లోకేశ్ అల్పాహార భేటీ
మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేశ్ అల్పాహార భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ అంశం చర్చకు వచ్చింది. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో 16వేల పైచిలుకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని, జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని మంత్రులు వ్యాఖ్యానించారు. డీఎస్సీ అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని పలువురు మంత్రులు సూచించారు. ఇన్‌చార్జి మంత్రులు తమ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తలను కలవాలని లోకేశ్ సూచించారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని, కార్యకర్తల నుంచి నియోజకవర్గ పరిస్థితులపై ఇన్‌చార్జి మంత్రులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. యూరియా విషయంలో రైతుల ముసుగులో వైసీపీ చేసే కుతంత్రాలను దీటుగా తిప్పికొట్టాలన్నారు. కాగా, మంత్రివర్గ సమావేశానికి ముందు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా పలకరించారు. కూటమి తరఫున ఈనెల 10న అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్.. సూపర్ హిట్ బహిరంగ సభ నిర్వహణపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని కలుస్తున్న నేపథ్యంలో ఆ వివరాలను పవన్‌తో లోకేశ్ పంచుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఇకపై గిరిజనులకూ పెద్ద సిలిండర్లు.. దీపం-2 కింద అదనపు లబ్ధి
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం 5 కిలోల గ్యాస్ కనెక్షన్లు (చిన్న సిలిండర్లు) ఉన్న కుటుంబాలకు ఇక నుంచి 14.2 కిలోల ఎల్పీజీ కనెక్షన్లు అందించనుంది. ‘దీపం-2’ పథకం కింద అర్హులైన గిరిజనులందరికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసేందుకు పౌరసరఫరాలశాఖ చేసిన ప్రతిపాదనకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వంపై ఏడాదికి రూ.5.5 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.