Share News

C. Erriswamy: అమ్మ మాట విని ఉంటే.. ఘోరం జరిగేది కాదు

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:34 AM

ఓరేయ్‌.. ఇంత రాత్రిలో ఎందుకెళ్తారురా.. ఉదయమే వెళ్లండి. అంటూ అమ్మ ఎంతచెప్పినా వినలేదు. రాత్రి ఇద్దరం మద్యం తాగి ఇంట్లో పడుకున్నాం. కానీ, ఎంత మత్తులో ఉన్నా నాకు బైక్‌ నడపడం అలవాటే..

C. Erriswamy: అమ్మ మాట విని ఉంటే.. ఘోరం జరిగేది కాదు

  • డివైడర్‌ను ఢీకొని పడిపోయాం.. అతివేగంగా వచ్చిన వి.కావేరి బస్సు బైక్‌ను దూసుకుంటూ పోయింది.. మంటలొచ్చి క్షణాల్లో ఘోరం

  • బెల్టు షాపులో మందు కొన్నామన్నది దుష్ప్రచారమే: ఎర్రిస్వామి

కర్నూలు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ‘‘ఓరేయ్‌.. ఇంత రాత్రిలో ఎందుకెళ్తారురా.. ఉదయమే వెళ్లండి. అంటూ అమ్మ ఎంతచెప్పినా వినలేదు. రాత్రి ఇద్దరం మద్యం తాగి ఇంట్లో పడుకున్నాం. కానీ, ‘ఎంత మత్తులో ఉన్నా నాకు బైక్‌ నడపడం అలవాటే.. డోన్‌లో దింపేసి వస్తా’నని మిత్రుడు శివశంకర్‌ బలవంతం చేస్తే పల్సర్‌ బైక్‌పై బయలుదేరాం. కానీ, అరగంటలోనే డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయాం. శివశంకర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. అత్యంత వేగంగా వచ్చిన వి.కావేరి ట్రావెల్‌ బస్సు రోడ్డుపై పడిన బైక్‌ను ఢీకొని దూసుకుంటూ ముందుకు వెళ్లింది. నా కళ్ల ముందే మంటలు చెలరేగి క్షణాల్లో బస్సంతా కాలిపోయింది. నాకేమీ అర్థం కాలేదు. భయపడిపోయా.’’ అని బైక్‌ ప్రమాదంలో గాయాలతో బయటపడిన సి. ఎర్రిస్వామి అలియాస్‌ నాని వివరించారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. కర్నూలులోని చిన్నటేకూరులో జరిగిన ఘోర ప్రమాదానికి ముందు ఏం జరిగిందో వివరించారు.


పెళ్లికి వెళ్లాలని వచ్చి..

‘‘మా నాన్న చంద్రశేఖర్‌ తుగ్గలి మండలం రాంపల్లిలో, అమ్మ వరలక్ష్మి కర్నూలు శివారులోని పెద్దటేకూరులో ఉంటున్నారు. నేను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో చెత్త సేకరించే ఓ కాంట్రాక్టర్‌ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నా. నాతో పాటు ఓ మిత్రుడు కల్యాణ్‌ కూడా అక్కడే పని చేస్తున్నాడు. మిత్రుడు కల్యాణ్‌ పెళ్లికి వెళ్లాలని గరువారం(23వ తేదీ) మధ్యాహ్నం గచ్చిబౌలి నుంచి కారులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పెద్దటేకూరులో మా ఇంటికి వెళ్లా. అమ్మ ఇంట్లో లేదు. దీంతో మూడేళ్ల కిందటి మిత్రుడు, తాపీ పనిచేసే శివశంకర్‌కు ఫోన్‌ చేసి పిలిచా. వెంటనే ఇంటివి వచ్చాడు. ఈ సందర్భంగా మద్యం తాగుదామంటే శివశంకర్‌ పల్సర్‌ బైక్‌పై రాత్రి 7 గంటల సమయంలో పెద్దటేకూరులోని శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్‌షా్‌పకు వెళ్లి రెండు క్వార్టర్లు మద్యం కొని ఇద్దరం అక్కడే తాగాం. 8:25 గంటల సమయంలో మరోసారి రెండు క్వార్టర్లు కొని తాగాం. డబ్బులు చెరో సగం చెల్లించాం. బెల్ట్‌ షాపులో మద్యం కొనలేదు. మద్యం షాపులోనే కొన్నాం. మద్యం తాగాక రాత్రి 9:15 గంటల సమయంలో ఇంటికి వెళ్లి పడుకున్నాం. రాత్రి 10:30 గంటల సమయంలో అమ్మకు ఫోన్‌ చేసి.. రాంపల్లిలో ఫ్రెండ్‌ పెళ్లికి వెళ్తున్నాను. పెళ్లి చూసుకుని రేపు రాత్రికి వస్తానని చెప్పాను. ‘ఓరేయ్‌ ఇంతరాత్రిలో ఎందుకు వెళ్తారురా.. పొద్దునే వెళ్లోచ్చుగా.. నా మాట వినరా.. రాత్రివేళ ఎందుకు వెళ్తావు..’ అని మా అమ్మ చెప్పింది. అయినా అమ్మ మాట వినలేదు.


అరగంటలో డివైడర్‌ను ఢీకొన్నాం

అర్ధరాత్రి 2:15 గంటల సమయంలో నా ఫ్రెండ్‌ శివశంకర్‌ నిద్రలేపాడు. డోన్‌లో వదిలేసి వస్తానని చెబితే.. వద్దువద్దు కర్నూలు బస్టాండ్‌లో వదిలేయ్‌.. అక్కడి నుంచి బస్సుకు వెళ్తానని ఎంతచెప్పినా వినలేదు. రాత్రి ఎక్కువగా మద్యం తాగడంతో మైకంలోనే ఉన్నాడు. ఈ టైంలో వద్దు.. బైక్‌కు డూంలైట్‌ కూడా లేదు అంటే వినలేదు. ‘నాకు బైక్‌ నడపడం అలవాటే.. డోన్‌లో దింపేస్తాను రా!’ అని బలవంతం చేస్తే అతని పల్సర్‌ బైక్‌పై బయలుదేరాం. బైక్‌కు హెడ్‌లైట్‌ కూడా లేదు. ఇండికేటర్‌ వెలుగులోనే బయలుదేరాం. అప్పుడు వర్షం పడడం లేదు. పది నిమిషాల్లో చిన్నటేకూరు సమీపంలో ఓ బంక్‌లో పెట్రోల్‌ కోసం వెళ్లాం. బంకులో పని చేసే సిబ్బంది నిద్రలో ఉన్నారు. శివశంకర్‌ గట్టిగా అరుస్తూ కేకలు వేశాడు. ఆ అరుపులకు లేచి అటువైపు రమ్మంటే వెళ్లి రూ.300 పెట్రోల్‌ పోయించుకున్నాం. అప్పుడు సమయం 2:25 గంటలు అయి ఉంటుంది. నేషనల్‌ హైవేపైకి వచ్చాం.. వర్షం మొదలైంది. ఆ వర్షంలోనే ఐదారు కిలోమీటర్లు వెళ్లామో లేదో.. 70 కిలోమీటర్లకు పైగా ఓవర్‌ వేగంతో బైక్‌ నడుపుతున్న శివశంకర్‌ డివైడర్‌కు ఢీకొట్టగానే నేను డివైడర్‌ మధ్యలో గడ్డిలో పడిపోయాను. బైక్‌, శివశంకర్‌ రోడ్డు మధ్యలో పడిపోయాడు. నేను లేచివెళ్లి పలకరిస్తే ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నాడు. తల నుంచి రక్తం కారుతోంది. బలవంతంగా లాక్కుంటూ వెళ్లి రోడ్డు పక్కకు తీసుకొచ్చాను.


కళ్ల ముందే బస్సు..

ఫ్రెండ్‌ శివశంకర్‌ శవాన్ని రోడ్డుపక్కకు చేర్చాను. అదేవిధంగా రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను పక్కకు తీసే ప్రయత్నం కూడా చేశాను. వాహనాలు వేగంగా వస్తుండడంతో సాధ్యం కాలేదు. బ్లూ రంగు బస్సు ఒకటి ముందుగా రోడ్డుపైన పడిన బైక్‌ను ఢీకొని వెళ్లింది. ఆ బస్సు వెళ్లిన కొన్ని క్షణాలకే పసుపు రంగులో ఉన్న బస్సు(వి.కావేరి) అతివేగంగా బెంగళూరు వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో పడివున్న మా పల్సర్‌ బైక్‌ను ఢీకొని దూసుకుంటూ వెళ్లడం నా కళ్లారా చూశా. బస్సు ముందు చక్రాల కింద బైక్‌ ఇరుక్కుని అలాగే కొంత దూరం వెళ్లింది. ఇంతలో బస్సు ముందు భాగంలో మంటలు వచ్చాయి. డ్రైవర్‌ బస్సు ఆపేసి ఆ మంటలను ఆర్పుతున్నట్లు గమనించాను. ఇంతలోనే మంటలు బస్సంతా వ్యాపించి బస్సు తగలబడిపోయింది. ఆ క్షణంలో నాకేమీ అర్థం కాలేదు. భయమేసింది. అప్పుడు అర్ధరాత్రి 3 గంటలు అయి ఉండవచ్చు. పోలీసులు, ఫైర్‌ ఇంజన్‌, అంబులెన్స్‌లు వచ్చాయి. నాకు భయమేసి పక్కకు వెళ్లాను. అప్పటికే ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇదంతా నాపైకి వస్తుందోమో అని భయమేసి.. ఓ ఐచర్‌ డ్రైవర్‌ను లిఫ్ట్‌ అడిగి డోన్‌కు, అక్కడి నుంచి బస్సులో మా ఊరు రాంపల్లికి వెళ్లాను. నా మిత్రుడు శివశంకర్‌ సెల్‌ఫోన్‌ కూడా నాతోనే తీసుకెళ్లాను. యాక్సిడెంట్‌ జరిగిందని శివశంకర్‌ ఇంట్లో వాళ్లకు చెప్పలేదు.


పోలీసులు ఇంటికొచ్చారు!

తన సొంత ఊరు రాంపల్లికి వచ్చి, తన కుటుంబ సభ్యులను కలిసినా.. బస్సు ప్రమాద విషయాన్ని చెప్పలేదని ఎర్రిసామి చెప్పారు. ‘‘నాకు ఏమి తెలియనట్లు మిత్రుడు పెళ్లికి వెళ్లి వచ్చాక.. ఇంట్లో పడుకున్నా. రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు వచ్చి నాన్నను విచారిస్తే.. మా అబ్బాయి ఇంట్లో పడుకున్నాడని చెప్పాడు. నన్ను కర్నూలు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. జరిగిన విషయం పోలీసులకు చెప్పాను. నా వల్ల ప్రమాదం జరగలేదు. నా టైం బ్యాడ్‌. రాత్రి అమ్మ మాట వివివుంటే ఈ ఘోరం జరిగేది కాదు.’’ అని ఎర్రిస్వామి కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - Oct 30 , 2025 | 04:38 AM