BV Raghavulu: 30మంది సీపీఎం నాయకులను పొట్టన పెట్టుకున్నారు.. ఏం సాధించారు
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:42 AM
పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన 30 మంది సీపీఎం నాయకులను పొట్టనపెట్టుకుని చివరకు సాధించిందేమిటని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు...
మావోయిస్టులకు బీవీ రాఘవులు సూటి ప్రశ్న
చింతూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన 30 మంది సీపీఎం నాయకులను పొట్టనపెట్టుకుని చివరకు సాధించిందేమిటని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మావోయిస్టులను సూటిగా ప్రశ్నించారు. మీ తుపాకులతో సీపీఎం నాయకులను హత్య చేస్తే... పోలీసులు వారి తుపాకులతో మిమ్మల్ని హత్య చేశారని వ్యాఖ్యానించారు. పార్టీకి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినా మావోయిస్టులపై జరుగుతున్న కగార్ దాడులను ఖండించింది తాము మాత్రమే అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆదివారం జరిగిన సీపీఎం అమరవీరుల 40వ సంస్మరణ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టుల వైఖరిని 50ఏళ్ల క్రితమే సీపీఎం నిరసించిందన్నారు. తుపాకీతో ఏనాటికీ రాజ్యాధికారం రాదని, ప్రజా పోరాటాల ద్వారానే సిద్ధిస్తుందన్న విషయం ఇప్పటికిగానీ మావోయిస్టుల బుర్రకు ఎక్కలేదన్నారు. ఇందుకు నిదర్శనమే నేటి మావోయిస్టుల లొంగుబాట్లు అని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.