CM Chandrababu: దేశీయ ఉత్పత్తులనే కొనండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:45 AM
దేశీయంగా తయారైన ఉత్పత్తులనే రాష్ట్ర ప్రజలు కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. భారత ఉత్పాదక రంగాన్ని పటిష్ఠం చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపు.. భారత ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయండి
‘బ్రాండ్ ఇండియా’ అభివృద్ధి మన బాధ్యత.. ఇంటింటికీ జీఎస్టీ ప్రయోజనాలు
నెలరోజుల పాటు ప్రచారం.. ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు
19న అన్ని జిల్లాల్లో దీపావళి సంబరాలు.. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి
ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): దేశీయంగా తయారైన ఉత్పత్తులనే రాష్ట్ర ప్రజలు కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. భారత ఉత్పాదక రంగాన్ని పటిష్ఠం చేయాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా ‘బ్రాండ్ ఇండియా’ను అభివృద్ధి చేయడం అందరి బాధ్యతని స్పష్టంచేశారు. దీనివల్ల ఎవరిపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థ స్వయంసమృద్ధి సాధిస్తుందని, భారత సమాజ ఉపాధికి అదొక హామీగా నిలుస్తుందన్నారు. సోమవారం శాసనసభలో జీఎ్‌సటీ ప్రయోజనాలు, ప్రచార కార్యక్రమాలపై సీఎం మాట్లాడారు. ‘జీఎ్‌సటీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త దశకు నాంది పలుకుతున్నాయి. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం వల్ల పారదర్శకత, ప్రజల ఆదా శక్తి పెరుగుతాయి. ఈ మార్పులు పేదలకు, నూతన మధ్యతరగతికి, మధ్య తరగతికి లాభాన్నిస్తాయి. ప్రగతిశీల ప్రజా విధానాల ద్వారా పేదలు, మధ్యతరగతి వారి జీవితాలు మార్చడమే మా లక్ష్యం. భారత స్వాతంత్య్ర శత వార్షికోత్సవం నాటికి ఆర్థిక అసమానతలు తగ్గించి, బలమైన, సమతుల్యమైన సమాజాన్ని నిర్మించడం మా ఆకాంక్ష. ఈ లక్ష్యానికి సూపర్ జీఎ్‌సటీ, సూపర్ సిక్స్, పీ4 కార్యక్రమాలు శక్తిమంతమైన ఇంధనంగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర వైపునకు నడిపిస్తాయనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని చెప్పారు. ఈ సంస్కణలు భవిష్యత్ తరాలను మార్చేంత శక్తిమంతమైనవని, వీటికి సమానంగా మరికొన్ని సంస్కరణలు తెచ్చుకోగలిగితే 2047 నాటికి ఇండియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందన్నారు. జీఎ్‌సటీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా రూ.2.25 లక్షల కోట్ల ప్రయోజనం వస్తే.. రాష్ట్రానికి రూ.8,000 కోట్ల ప్రయోజనం వస్తుందని చెప్పారు. ‘ఇంట్లో వాడే వస్తువులకు జీరో పన్ను ఉంటుంది. వినియోగం పెరిగి చిన్న వ్యాపారులకు, ఎంఎ్‌సఎంఈలకు ఊతమొస్తుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు’ అని తెలిపారు.
ఇంటింటికీ ప్రచారం..
జీఎస్‌టీ ఫలాలు ప్రజలందరికీ అందించాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం చెప్పారు. అందుకే ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ వేశామన్నారు. ఇందులో లోకేశ్, పయ్యావుల కేశవ్, అనిత, కందుల దుర్గేశ్, సత్యకుమార్ ఉంటారని తెలిపారు. జీఎ్‌సటీ ప్రయోజనాల గురించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ, అన్ని వర్గాలకు చేరవేయడం కోసం సోమవారం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నామని.. నెల రోజులపాటు 65,000 సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంటింటి ప్రచారం చేయిస్తామని తెలిపారు. విద్యాసంస్థలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ‘జీఎ్‌సటీ 2.0 వల్ల కుటుంబాల పొదుపు ఎలా పెరిగిందో ఇంటింటికీ ప్రచారపత్రాలు పంచి చైతన్యపరచడం, వ్యవసాయం, ఇతర విభాగాల వారీగా ఎవరెవరికీ ఏ విధంగా ప్రయోజనాలు అందుతున్నాయో అర్థమయ్యేలా చెప్పడం, మానవనరుల అభివృద్ధి, టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడం, ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రజలను భాగస్వాములు చేయడం, అభివృద్ధి, సంపద సృష్టిపై కార్యక్రమాలు నిర్వహించి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారంపై అవగాహన కల్పిస్తాం. ఈ నెల 30, అక్టోబరు 1 తేదీల్లో ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉంటారు. వ్యవసాయం, ఉద్యానవన, ఉపాధి హామీ, మత్స్యకారులకు వచ్చిన లాభాలను అర్థమయ్యేలా చెబుతాం. ప్రజోపయోగం ఎక్కువగా ఉన్న అంశాలపై రాష్ట్రంలో 850 కేంద్రాల్లో, పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో 200 కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అక్టోబరు 6వ తేదీన సెలూన్లు, స్పా, యోగా, జిమ్‌ల్లో ప్రచారం చేపడతాం. అక్టోబరు 19న 26 జిల్లాల్లో ప్రభుత్వం తరఫున దీపావళి సంబరాలు నిర్వహిస్తాం. రైతు సేవా కేంద్రాల్లో, గ్రామ/వార్డు సచివాలయాల్లో.. వాణిజ్య పన్నుల అధికారులు, ప్రజాప్రతినిధులను, టీచర్లను నియమించి.. వారి ద్వారా అన్ని వర్గాలకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తాం’ అని చెప్పారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తామని తెలిపారు.