Share News

పురాతన భవనంలో బిక్కుబిక్కుమంటూ విధులు

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:23 PM

బ్రిటిష్‌ కాలం నాటి శిథిల భవనం.. పురాతన చెక్క బీరువాలు, కుర్చీలు, టేబుళ్లు. భవనం పైకప్పు రంధ్రం పడడంతో వానొస్తే తడిసిపోతున్న గదులు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఇబ్బందులు.. ఇదీ నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ కార్యాలయ దుస్థితి.

పురాతన భవనంలో బిక్కుబిక్కుమంటూ విధులు
నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ డివిజనల్‌ కార్యాలయం

శిథిలావస్థలో ఆర్‌అండ్‌బీ కార్యాలయ భవనం

ఇప్పటికీ బ్రిటిష్‌ కాలం నాటి ఫర్నిచర్‌ వినియోగం

భవనం పైకప్పునకు రంధ్రం పడడంతో వానొస్తే తడిసిపోతున్న గదులు

ఫైళ్లపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పాల్సిన దుస్థితి

సిబ్బందికి తప్పని ఇబ్బందులు

ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినా స్పందించని వైనం

నర్సీపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): బ్రిటిష్‌ కాలం నాటి శిథిల భవనం.. పురాతన చెక్క బీరువాలు, కుర్చీలు, టేబుళ్లు. భవనం పైకప్పు రంధ్రం పడడంతో వానొస్తే తడిసిపోతున్న గదులు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఇబ్బందులు.. ఇదీ నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ కార్యాలయ దుస్థితి.

బ్రిటీష్‌ కాలం నాటి భవనంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. డీఈఈ, నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి, కృష్ణాదేవి ఏఈలు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. పురాతన భవనం కావడంతో పైకప్పునకు రంధ్రం పడడంతో వర్షం పడినప్పుడు నీరు లీకై గదులు చిన్నపాటి చెరువులా తయారవుతున్నాయి. గోడలు నానిపోయి ముఖ్యమైన ఫైళ్లకు రక్షణ లేకుండాపోయింది. కార్యాలయంలో రికార్డులు పెట్టుకోవడానికి అల్మారాలు, భద్రపరుచుకోవడానికి బీరువాలు లేవు. ఇప్పటికీ పురాతన చెక్క బీరువాలే వాడుతున్నారు. బ్రిటీష్‌ కాలం నాటి పాడైన చెక్క కుర్చీలు, టేబుళ్లు వినియోగిస్తున్నారు. నర్సీపట్నం ఏఈ ఆఫీసు గది మరీ అధ్వానంగా ఉంది. వర్షం పడితే పైకప్పు నీరు లీకై మడుగులా తయారవుతోంది. ఫైళ్లు తడవకుండా వాటిపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పుతున్నారు. వర్షాకాలంలో అన్ని గదులు, వరండాల్లో నీరు లీకేజీ సమస్య ఉంది. కార్యాలయానికి తూర్పు భాగంలో ప్రహరీ గోడ పడిపోవడంతో చీకటి పడితే ఈ ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారిపోతోంది.

ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యం

ఆర్‌అండ్‌బీ కార్యాలయ భవనం మరమ్మతులకు రూ.35 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. పాత గోడలు అలాగే ఉంచి పైకప్పు మొత్తం మార్చడానికి ప్రణాళిక చేశారు. అన్ని గదులకు సీలింగ్‌లు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, ఎలక్ట్రికల్‌, ఫర్నిచర్‌ ఏర్పాటు చేయడానికి అంచనాలు తయారు చేశారు. ప్రతిపాదనలు పంపి ఆరు నెలలుగా కావస్తున్నా ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు.

Updated Date - Jul 07 , 2025 | 11:23 PM